- త్వరగా పనులు చేపట్టి తాగు, సాగునీటిని అందించాలన్న రైతులు, నేతలు, ప్రజలు
- ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదన్న పీసీబీ ఆఫీసర్లు
- దామరగిద్ద తండాలో ప్రశాంతంగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ
ఊట్కూరు (నారాయణపేట), వెలుగు : నారాయణపేట– -కొడంగల్–- మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా తమ భూములు సస్యశ్యామలం అవుతాయని రైతులు, నేతలు స్పష్టం చేశారు. కృష్ణానది చెంతనే పారుతున్నా ఏండ్లుగా తమకు సాగునీరు అందడం లేదని వాపోయారు. వానలపైనే ఆధారపడి పంటలను సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేస్తే.. సాగు, తాగు నీరు అందుతుందని అభిప్రాయపడ్డారు.
వెంటనే పర్యావరణ అనుమతులను తీసుకొచ్చి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని కోరారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దామరగిద్ద తండాలో గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆధ్వర్యంలో ‘కొడంగల్’ ఎత్తిపోతల( లిఫ్ట్) ప్రాజెక్ట్ కు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు నిర్వహించారు. కార్యక్రమానికి నారాయణపేట, మక్తల్ సెగ్మెంట్లలోని 7 మండలాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సభలో అధికారులు, రైతులు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు. లిఫ్ట్తో ఎలాంటి పర్యావరణ ముప్పు లేదని స్పష్టంచేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ను చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను నమోదు చేసుకున్నామని, మీటింగ్ మినిట్స్‌తో పాటు వీడియోను కాలుష్య నియంత్రణ మండలికి అందజేస్తామని హైదరాబాద్ కు చెందిన పీసీబీ ఈఈ సురేశ్ తెలిపారు.
లిఫ్ట్కింద ఊట్కూరు ముంపునకు గురయ్యే ఆస్కారమే లేదని, ఇక్కడ సంచరించే జింకలను సంరక్షిస్తామని ఇరిగేషన్ఎస్ఈ శ్రీధర్పేర్కొన్నారు.అధికారులు రైతులకు అపోహలపై అవగాహన కల్పించాలని, నష్టపరిహారాన్ని రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల పెంచాలని, లిఫ్ట్‌ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కానుకుర్తికి చెందిన రైతు బసిరెడ్డి అన్నారు. తన ఎకరా భూమి పోతుందనే బాధకంటే, తమ ప్రాంత భూములకు సాగునీరు రావడం సంతోషంగా ఉందని దామరగిద్ద తండాకు చెందిన రైతు నర్సప్ప పేర్కొన్నారు.
