హైదరాబాద్, వెలుగు: డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఉత్తర్వులను శుక్రవారం వెలువరిస్తామని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా డీజీపీ శివధర్‌రెడ్డి నియామకం జరిగిందని సామాజిక కార్యకర్త టి.ధన్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు.
అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదిస్తూ..గత విచారణలో ఇచ్చిన ఆదేశాల మేరకు డిసెం బరు 31న యూపీఎస్సీకి కొత్త జాబితాను పంపినట్టు తెలిపారు.ఆలస్యమైందనే కారణం చూ పుతూ జనవరి 1న యూపీఎస్సీ జాబితాను తిరిగి పంపిందన్నారు.
అయితే ఏపీ ప్రభుత్వం 11 ఏండ్ల తర్వాత పంపిన జాబితాకు మాత్రం యూపీఎస్సీ ఆమోదం తెలిపిందని వివరించారు. యూపీఎస్సీ తరఫు న్యాయవాది కులకర్ణి వాదిస్తూ..ఏడేండ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపిందని, ఇది ప్రకాశ్ సింగ్ బాదల్ కేసు మార్గదర్శకాలకు విరుద్ధమని అన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణను వాయిదా వేశారు.
