Jana Nayagan: ‘జన నాయగన్’ రిలీజ్‌పై ఉత్కంఠ.. CBFC జాప్యంపై హైకోర్టు ప్రశ్నలు.. ఇవాళే (JAN9) ఫైనల్ తీర్పు!

Jana Nayagan: ‘జన నాయగన్’ రిలీజ్‌పై ఉత్కంఠ.. CBFC జాప్యంపై హైకోర్టు ప్రశ్నలు.. ఇవాళే (JAN9) ఫైనల్ తీర్పు!

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ (జనవరి 9) థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం, విడుదలకు కేవలం రెండు రోజుల ముందే వాయిదా పడి, ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికే ఎగ్జామినింగ్ కమిటీ సినిమా వీక్షించి, సూచించిన కట్స్‌ను అమలు చేసినప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జాప్యం కారణంగా సినిమా థియేట్రికల్ రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. దాంతో పాటు షోలు రద్దు కావడం, ముందుగా బుక్ చేసిన టికెట్లకు రిఫండ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత విచారణల్లో, సినిమాను రివైజింగ్ కమిటీకి ఎందుకు పంపాల్సి వచ్చిందనే అంశంపై మద్రాస్ హైకోర్టు, CBFCను ప్రశ్నించింది. అలాగే, సెన్సార్ ప్రక్రియలో నిబంధనలు సక్రమంగా పాటించారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ‘జన నాయగన్’ సినిమా విడుదలపై కీలకమైన తీర్పును ఇవాళ శుక్రవారం (జనవరి 9న) కోర్టు వెల్లడించనుంది.

ఇదిలా ఉండగా, విజయ్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నేపధ్యంలో ఈ కేసు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత చర్చకు దారి తీసింది. ఇవాళ వెలువడే కోర్టు తీర్పుతో ‘జన నాయగన్’ రిలీజ్ ముందుకు సాగుతుందా లేదా మరింత ఆలస్యం తప్పదా అన్నది తేలనుంది.