
- బీజేపీని బద్నాం చేయడమే ఇద్దరు సీఎంల ఎజెండా
- జల వివాదాల పరిష్కారానికి కేంద్రమే కమిటీ వేసింది
- ఆ కమిటీ ముందు హాజరై అభ్యంతరాలు చెప్పాలని సూచన
కరీంనగర్/హుజూరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న జల వివాదాలపై ఢిల్లీ మీటింగ్‌లో ఏం జరిగిందో బయటపెట్టాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల సీఎంలపైనే ఉన్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘‘బనకచర్ల విషయంలో కమిటీ వేస్తామన్నారని ఏపీ మంత్రి చెప్తే, అసలు బనకచర్ల మీద చర్చనే జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. వీళ్లకు వాస్తవమేంటో తెలిసినా బయటకు చెప్పడం లేదు. మీటింగ్‌లో ఏం జరిగిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది. కేంద్రం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర సీఎం చెప్పట్లేదు.. ఆ రాష్ట్ర మంత్రి చెప్పట్లేదు. ఎందుకంటే ఈ ఇష్యూను లాగాలే.. పాలిటిక్స్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలే.. బీజేపీని, కేంద్ర మంత్రిని
బద్నాం చేయాలే.. ఇదీ వాళ్ల ఎజెండా’’ అని
మండిపడ్డారు.
‘‘నిజానికి రెండు రాష్ట్రాల సీఎంలు సొంత ఎజెండాలతో మీటింగ్‌కు వెళ్లారు. వారి ఎజెండాలోని అన్ని అంశాలపై ఒక్క గంటలో, ఒక్క రోజులో చర్చించడం సాధ్యం కాదు. అందుకే కేంద్రం ఉన్నతాధికారులు, నిపుణులతో కమిటీని నియమించింది. కేంద్రానికి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమే. గతంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం సీఎంలను కూర్చోబెట్టిన దాఖలాలు లేవు. ఇది కేంద్రం సాధించిన తొలి విజయం. నిన్నటి సమావేశంలో జరిగింది ఇదే. ఇంతకు మించి ఏమీ జరగలేదు” అని బండి సంజయ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే ఆ కమిటీ ముందు హాజరై ఆయా అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాలని సూచించారు. కేంద్రం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నా ఇరు రాష్ట్రాల సీఎంలు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. గవర్నమెంట్ హైస్కూళ్లలో టెన్త్ చదివే స్టూడెంట్లకు గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బనకచర్లపై లేనిపోని వివాదాలు..
కేంద్రానికి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమేనని బండి సంజయ్ తెలిపారు. ‘‘ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగొద్దని, సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతోనే కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేం స్వాగతిస్తున్నాం.
అనేక ఏండ్లుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. దీన్ని బూచిగా చూపెట్టి రెండు రాష్ట్రాల మధ్య కొందరు వైరుధ్యాలు సృష్టించాలని చూస్తున్నారు. జల వివాదాలపై బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం విడ్డూరం. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో ఉన్నట్లుంది. అందుకే రెండు పార్టీలు కలిసి బనకచర్లపై లేనిపోని వివాదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి” అని మండిపడ్డారు. కొత్త వివాదాలకు, కొత్త నినాదాలకు ఆజ్యం పోసే పరిస్థితి తీసుకురావొద్దని హితవు పలికారు.
ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఒప్పుకోం..
బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర జరుగుతున్నదని బండి సంజయ్ ఆరోపించారు. ‘‘బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ చాలా క్లియర్‌గా ఉంది. 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే అందజేస్తామంటే కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదించే బాధ్యతను మేం తీసుకుంటాం. అలా కాకుండా 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. బీసీల ముసుగులో ముస్లింలందరికీ నూటికి నూరుశాతం రిజర్వేషన్లు అందించే కుట్ర జరుగుతున్నది. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేసి బీసీల పొట్ట కొట్టారు. ఇక 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు అమలు చేస్తే.. స్థానిక సంస్థల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. బీసీ సంఘాలు వీటిని గమనించాలి” అని కోరారు.
బీజేపీలో ఏ గ్రూపు లేదు..
ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు రావాలని సిట్ నుంచి సమాచారం వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 24న విచారణకు హాజరవుతానని వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీలో గ్రూపులపై స్పందిస్తూ.. ‘‘బీజేపీలో ఏ గ్రూపు లేదు.. ఉన్నదల్లా మోదీ గ్రూప్ మాత్రమే. జెండా కోసం, పార్టీ కోసం పని చేయాలి.. అంతే తప్ప వ్యక్తి కోసం పనిచేస్తే ప్రోత్సహించే ప్రసక్తే లేదు. అది బండి సంజయ్ వర్గమైనా సరే.. ఇంకే వర్గమైనా సరే ఉపేక్షించేది లేదు. టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు” అని హెచ్చరించారు.
కాళేశ్వరం అవినీతికి ఇదే నిదర్శనం..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడానికి అధికారుల అక్రమాస్తులే నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్ అధికారుల అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏసీబీ దాడుల్లో వందల కోట్లు పట్టుబడుతున్నాయి. కాళేశ్వరం అంచనాలు పెంచి ఏ విధంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందో వీళ్లను చూస్తే అర్థమవుతోంది. ఇవిగాకుండా డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ సహా కేసీఆర్ కుటుంబంపై ఎన్నో అవినీతి కేసులున్నా... గత 19 నెలలుగా ఒక్కటంటే ఒక్క కేసు విషయంలోనూ వాళ్లను దోషులుగా తేల్చలేకపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలకు ఇది నిదర్శనం. రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి’’ అని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర సర్కార్ సీబీఐ విచారణ కోరితే, దర్యాప్తు జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.