ప్రజలకు కనిపించని సీఎం ఎందుకు?

ప్రజలకు కనిపించని సీఎం ఎందుకు?

అలాంటి సీఎం రాష్ట్రానికి అవసరం లేదు: బండి సంజయ్
కేసీఆర్ లో మానవత్వం చచ్చిపోయింది
పేదలకు ట్రీట్మెంట్ అందడం ఆయనకు ఇష్టం లేదు
చిన్నపాటివానకే ఉస్మానియా వార్డుల్లోకి నీళ్లు రావడమేంటి?
హాస్పిటల్లో ఉన్నామా.. రోడ్ల మీద ఉన్నామా అన్న అనుమానం వచ్చిందని కామెంట్

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రిలో వరదలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సర్కారు తీరుపై విమర్శలు గుప్పించాయి. సీఎం కేసీఆర్ మానవత్వాన్నే మరిచిపోయారని మండిపడ్డాయి. పేదలకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని ఆరోపించాయి. ఇలాంటి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నాయి. గురువారం ఉస్మానియా ఆస్పత్రిని బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచందర్రావు, పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మంత్రి తలసాని మాత్రం ఉస్మానియాలోకి నీళ్లురావడం కొత్తేమీ కాదంటూ ఘటనను కవర్ చేసే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ కు మానవత్వం లేదు: బండి సంజయ్
ప్రజలకు కనిపించని సీఎం రాష్ట్రానికి అవసరం లేదని, సీఎం కేసీఆర్ లో మానవత్వం చచ్చిపోయిందని బండి సంజయ్ మండిపడ్డారు. పేదలకు మంచి ట్రీట్మెంట్ అందడం సీఎం కేసీఆర్ కు ఏమాత్రం ఇష్టం లేదని, పేదలు చనిపోతుంటే చూస్తూ కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా హాస్పిటల్లో రోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన చెందారు. చిన్నపాటి వర్షానికే వార్డుల్లోకి నీళ్లురావడం ఏంటని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం కూల్చివేతలపై కేసులు వేస్తే.. సీఎం కేసీఆర్ అడ్డుకున్నారు. మరి, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న ఉస్మానియాను సీఎం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి వచ్చిన నీళ్లను చూస్తుంటే హాస్పిటల్లో ఉన్నామా లేదా రోడ్డు మీదనా అన్న డౌట్వచ్చింది. ఐదేళ్ల కిందట ఉస్మానియాకు వచ్చిన సీఎం ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. వాటన్నింటినీ ఇప్పుడు మరిచి పోయారు. కొత్త బిల్డింగ్ కట్టిస్తామని మాటిచ్చి పక్కన పెట్టేశారు. వెంటనే సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించి.. సౌకర్యాలు మెరుగుపరచాలి’’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ వ్యర్థాలను తరలించేందుకు రూ.15 కోట్లు కేటాయించారని, ఆ డబ్బులతో పేదలకు ట్రీట్ మెంట్ వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సచివాలయ నిర్మాణ ఆలోచనలను మానేసి పేదల కోసం ఆస్పత్రులు కట్టించాలన్నారు. బండి సంజయ్ ను ఉస్మానియా హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ నర్సులు, పారిశుధ్య కార్మికులు కలిశారు. గాంధీ ఆస్పత్రిలో
పెంచినట్టు తమకూ జీతాన్ని 25 వేలకు పెంచేలా చూడాలని కోరారు. తమను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

క్లీన్ చేసిన్రు
ఆస్పత్రిలో వరద నీటిని సిబ్బంది ఎత్తి పోశారు. వార్డులను క్లీన్ చేశారు. గురువారం మధ్యాహ్నం వరకు అంతా శుభ్రం చేశారు. డిజాస్టర్ టీం, వాటర్ వర్క్స్, ఉస్మానియా సిబ్బంది కలిసి ఆస్పత్రిలో చేరిన వర్షపు నీటిని తోడేశారు. వార్డుల్లోని కొందరు పేషెంట్లను డిశ్చార్జ్ చేయగా.. మిగతా పేషెంట్లను ఫస్ట్ ఫ్లోర్లోని వార్డులకు షిఫ్ట్ చేశారు. క్లీన్ చేసేదాకా రోగులు, వారి సహాయకులు బెడ్లపైనే ఉండిపోయారు. ప్రస్తుతం క్లీన్ చేసినా.. మళ్లీ వర్షం వస్తే వరద వచ్చే అవకాశాలున్నాయని సిబ్బంది చెబుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని కోరుతున్నారు.

ఉస్మానియా ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్
ఉస్మానియా వార్డుల్లోకి నీళ్లు రావడంపై మానవహక్కుల కమిషన్‌‌ సీరియస్ అయింది. వరద నీటితో రోగులు పడుతున్న ఇబ్బందిపై మీడియా కథనాలను సుమోటోగా తీసుకుంది. ఈఘటనపై ఆగస్టు 21లోగా రిపోర్ట్‌ ఇవ్వాలని సూపరింటెండెంట్ ను ఆదేశించింది.

కొత్త భవనం కట్టాలి
ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని నిర్మించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వర్షం నీళ్లు రావడంతో డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పాడుబడిపోయిన బిల్డింగ్ స్థానంలో కొత్తది కట్టాల్సందిగా గతంలోనే టీఎన్జీవో సంఘం సర్కార్ ను కోరిందని, ఈ ఆస్పత్రి ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులకు పురుడు పోసిందని, నిరుపేద కుటుంబాలకు భరోసానిచ్చిందని టీఎన్జీవో కేంద్ర సంఘం సభ్యులు కారం రవీందర్రెడ్డి, అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ చెప్పారు.

For More News..

‘సంగమేశ్వరం’పై ఏపీ కొత్త స్కెచ్

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్.. నరకం చూస్తున్న కరోనా పేషెంట్లు

సర్కార్ తప్పులు.. ఆఫీసర్లకు శిక్షలు