వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్  జిల్లా సంక్షిప్త వార్తలు

రఘునాథపల్లి, స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా శనివారం ఆయన జనగామ జిల్లా రఘునాథపల్లి, స్టేషన్ ఘన్ పూర్ మండలాల్లో పర్యటించారు. ఖిలాషాపూర్ గ్రామంలో పాదయాత్ర ప్రారంభం కాగా జాఫర్ గూడెం, అశ్వరావుపల్లి, మీదికొండ గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ బండి సంజయ్ ముందుకు సాగారు. అనంతరం మీదికొండ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

హామీలు అటకెక్కినయ్..

కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయని బండి సంజయ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందన్నారు. గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, బీజేపీ లాంటి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకున్నా కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాయ మాటలను ప్రజలు నమ్మరన్నారు. కాగా, మీదికొండ గ్రామంలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతన్ని బయటకు పంపించేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత జరిగింది. కార్యక్రమంలో  మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి, మాజీ మంత్రి గుండేటి విజయరామారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి మదాసు వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.

నేడు పాదయాత్రకు బ్రేక్

మునుగోడులో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ నేపథ్యంలో నేడు పాదయాత్రకు బండి సంజయ్ స్వల్ప విరామం ప్రకటించారు. మునుగోడులో నిర్వహించే సభకు ఆయన హాజరుకానున్నారు. సోమవారం యధావిధిగా పాదయాత్ర తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

పొలం దున్నుతుండగా గుండెపోటు

కొత్తగూడ, వెలుగు: పొలం దున్నుతుండగా గుండె పోటు వచ్చి, రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం తండాలో శనివారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన బాదావత్ మంగ్యా(38) రోజూలాగే పొలం దున్నుతున్నాడు. సాయంత్రం సడెన్​గా గుండె పోటు రావడంతో పొలంలోనే పడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. అప్పటికే చనిపోయాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బావిలో పడి మత్స్యకార్మికుడు మృతి..

రేగొండ, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు బండి మల్లయ్య బావిలో పడి మృతి చెందాడు. శనివారం మలయ్య తన వ్యవసాయ బావితో పాటు పక్కనే ఉన్న ఇంకో బావిలో చేప పిల్లలు పోసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి చనిపోయాడు.

ఆటోను ఢీకొట్టిన లారీ

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇల్లంద గౌడ కమ్యూనిటీ హాల్​ఎదుట ఈ యాక్సిడెంట్ జరిగగా.. గాయపడ్డవారు మడికొండ గ్రామస్తులు. వారిని అంబులెన్స్ లో వర్ధన్నపేటకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భారీగా పీడీఎస్ రైస్ సీజ్

కాజీపేట, వెలుగు: వరంగల్ అజంజాహీ మిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు రూ.1.04లక్షల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు వరంగల్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ శంభుని పేట్ ప్రాంతంలోని బుడిగ జంగాల కాలనీకి చెందిన తూర్పాటి వీరమ్మ.. తన ఇంట్లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు తనిఖీలు చేయగా 40 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
కల్యాణలక్ష్మికి అప్లై చేయడానికి వెళ్తూ..తిరిగిరాని లోకాలకు...

హసన్ పర్తి, వెలుగు: ప్రేమించి, పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకున్న ఆ యువకుడు.. ఆరు నెలలు పూర్తికాకముందే తిరిగిరాని లోకానికి వెళ్లాడు. కల్యాణ లక్ష్మి పథకం కోసం అప్లై చేయడానికి వెళ్తుండగా.. బైక్ పై కింద పడి చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన పల్లకొండ శివ(23), ఆరు నెలల కింద కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించి, పెండ్లి చేసుకున్నాడు. శనివారం తన బైక్ పై కల్యాణ లక్ష్మి అప్లై చేసేందుకు కాగితాలు తీసుకుని, హనుమకొండకు బయలుదేరాడు. రామారం క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బర్లను తప్పించబోయాడు. దీంతో బైక్ మీది నుంచి ​కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు 108కు కాల్​చేశారు. సమయానికి రాకపోవడంతో పోలీసులు తమ వెహికల్​లో ఎంజీఎంకు తరలించారు.అప్పటికే చనిపోయాడు.హెల్మెట్ లేకపోవడంతోనే?హెల్మెట్ ఉంటే శివ బతికేవాడని పలువురు చెబుతున్నారు. చిన్నపాటి యాక్సిడెంట్ అయినా తలకు తీవ్ర గాయం కావడం వల్లే ఆయన చనిపోయాడు. కాగా, గ్రేటర్ వరంగల్​పరిధిలో చాలామంది హెల్మెట్ ధరించడం లేదు. పోలీసులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ అనే కండీషన్ ఎక్కడా అమలు కావడం లేదు.

సమైక్య భావాన్ని రగిలించేలా వజ్రోత్సవాలు

వరంగల్ సిటీ, వెలుగు: ప్రజలందరిలో స్వాతంత్ర్య స్ఫూర్తి, సమైక్యతా భావం రగిలించేలా వజ్రోత్సవ సంబురాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. జీడబ్ల్యూఎంసీ హెడ్​ ఆఫీస్ ఆవరణలో రూ.10.20 లక్షలతో ఏర్పాటు చేసిన అశోక స్తూపాన్ని శనివారం చీఫ్​ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్​ గుండు సుధారాణితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. మిషన్​ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించి దేశంలోనే నంబర్​ వన్​ గా నిలిచామన్నారు. 
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్ట్ అని కేంద్రమే కితాబిచ్చిందన్నారు. కేంద్రం అవార్డులు ఇస్తోంది కానీ నిధులు మాత్రం మంజూరు చేయడం లేదన్నారు.

పరకాల సబ్ జైలుకు రిజర్డ్వ్ ఇన్స్ పెక్టర్

హనుమకొండ, వెలుగు: నయీం అనుచరులతో కలిసి భూ సెటిల్​మెంట్లకు తెరలేపి.. అమాయకులను తుపాకీతో బెదిరింపులకు గురి చేసిన కేసులో ప్రధాన నిందితుడు, పోలీస్ రిజర్డ్వ్ ఇన్స్ పెక్టర్ సంపత్ కుమార్​ను కేయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నిరోజులు కాశీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటూ తప్పించుకు తిరిగిన ఆయన.. శుక్రవారం ఉదయం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని తన ఇంటికి ఆటోలో వస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అదే రోజు రాత్రి జిల్లా జడ్జి ఎదుట హాజరు పరిచి, పరకాల సబ్​ జైలుకు తరలించారు. కాగా హనుమకొండ ఆరెపల్లి వద్ద ఓ ల్యాండ్ విషయంలో ఓ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, తిరిగి ఆయననే తుపాకీతో బెదిరించడంతో హసన్ పర్తి, కేయూ, హనుమకొండ పీఎస్​ ల పరిధిలో ఆర్​ఐ సంపత్​ కుమార్​, నయీం అనుచరుడు ముద్దసాని వేణుగోపాల్ సహా పది మందిపై  జులై 29న కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ మరునాడు పలివేల్పుల క్రాస్​ వద్ద కేయూ పోలీసులు తనిఖీలు చేపట్టి  కేతెపాక రమేశ్​, బొజ్జ హరిబాబు, అలువాల నరేశ్​, మేకల రమేశ్​, పంగ రవి, టిపుల్​ ప్రవీణ్​ అలియాస్​ చక్రి అనే ఆరుగురిని అరెస్ట్​ చేశారు. వారి నుంచి రెండు తల్వార్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు నమోదైన 20 రోజుల తరువాత ఆర్ఐ సంపత్​కుమార్​ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్ఐ సంపత్​ కుమార్​ ఏ2 నిందితుడిగా ఉండగా.. ఏ1 నిందితుడు, నయీం అనుచరుడైన ముద్దసాని వేణగోపాల్​, ఏ3  భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మాజీ ఎంపీపీ మల్లన్న, ఏ10  వేణుగోపాల్ కారు డ్రైవర్ క్రాంతి ఇంకా పరారీలోనే ఉండటం గమనార్హం.  వీరికి  జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో చాలా దగ్గరి సంబంధాలు ఉండడంతో.. ఆయనే వారికి ఆశ్రయం కల్పించారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ల్యాండ్​ సెటిల్​మెంట్లు, భూకబ్జాలు ఇతర వ్యవహారాలన్నింటిలో ఆర్​ఐ సంపత్​ కుమార్ కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో.. ఆయనను కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

రోడ్ల రిపేర్లను స్పీడప్ చేయాలి

నర్సంపేట, వెలుగు: నర్సంపేట పట్టణంలో గుంతలు పడ్డ రోడ్లను వెంటనే రిపేర్ చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్​ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రోడ్ల రిపేర్లతో పాటు మిషన్​ భగీరథ, పీఎన్​జీ గ్యాస్ పైప్​లైన్ పనుల్ని కూడా కంప్లీట్ చేయాలన్నారు. టౌన్​ డెవలప్​మెంట్​కోసం మంత్రి కేటీఆర్ ఇప్పటికే టీయూఎఫ్​ఐడీసీ నుంచి రూ.50కోట్ల ఫండ్స్ రిలీజ్ చేశారని తెలిపారు. ఇందులో రూ.10 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, రూ.15కోట్లతో 35 కమ్యూనిటీ హాల్స్, రూ.5కోట్లతో రింగ్ రోడ్, మాధన్నపేట రోడ్డు వెడల్పు, రూ.2కోట్లతో డివైడర్ల నిర్మాణం, రూ.3కోట్లతో టౌన్ సుందరీకరణ చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కమిషనర్ వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.