బీజేపీ మిలియన్ మార్చ్‌కు భయపడే కేసీఆర్ ప్రకటన

బీజేపీ మిలియన్ మార్చ్‌కు భయపడే కేసీఆర్ ప్రకటన

బీజేపీ యువ మోర్చా పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ కు భయపడే సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా యువతతో మిలియన్ మార్చ్ చేసి, అసెంబ్లీని ముట్టడించాలని బీజేపీ యువ మోర్చా ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో కేసీఆర్ భయపడ్డారని అన్నారు. రాష్ట్రంలో యువత ఇన్నాళ్లు ఉద్యోగాలు రాక చేసుకున్న ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని సంజయ్ అన్నారు. 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయంటూ సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లు లక్ష ఉద్యోగాలు, ఇంటికో జాబ్ అంటూ మాటలు చెప్పి, చెప్పి సీఎం మాట అంటే నమ్మకం లేకుండా చేసుకున్నారని అన్నారు. నిజం ఉద్యోగాల భర్తీ చేస్తామంటే మొదట స్వాగతించేది తామేనని బండి సంజయ్ చెప్పారు. నిరుద్యోగ యువత కోసం తాము లాఠీ దెబ్బలు తిన్నామని, జైళ్లకు పోయామని, ప్రభుత్వంపై ఎలాగైనా ఒత్తిడి చేసి నోటిఫికేషన్లు వచ్చేలా చేయాలని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు లక్షలాది నిరుద్యోగ యువతతో మిలియన్ మార్చ్ చేపట్టి.. అసెంబ్లీ ముట్టడించాలని నిర్ణయించారని అన్నారు. ఇందులో లక్షలాదిగా యువకులు పాల్గొనబోతున్నారని తెలిసి.. ప్రభుత్వం ముందుగానే స్పందించడం సంతోషమేనని అన్నారు. అయితే ఇప్పుడు మరోసారి అసెంబ్లీ వేదికగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసే ప్రయత్నంచేస్తున్నారని అన్నారు. ఇన్నాళ్లు నోటిఫికేషన్లు ఆలస్యం కావడానికి కారణమని అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. జోనల్ వ్యవస్థ విషయంలో 2018లోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయని గుర్తు చేశారు. కానీ దానిని అమలు చేయడంలో కేసీఆర్ సర్కారు ఆలస్యం చేసిందని ఆరోపించారు. 

జాబ్ క్యాలెండర్ అంటే అలా ఉండాలె

రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాస్ కమిటీ నివేదిక ఇచ్చిందని, అయితే ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తానంటే మిగతా వాటి సంగతేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని సీఎం ఇవాళ చెప్పారని, అందులో నోటిఫికేషన్, ఎగ్జామ్ డేట్, రిజల్ట్, జాయినింగ్ డేట్ సహా అన్నీ ఉంటేనే అది నిజమైన జాబ్ క్యాలెండర్ అవుతుందని, కాదని మోసం చేస్తే కేసీఆర్ బండారం బయటపడుతుందని అన్నారు. ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని  గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇన్నాళ్లుగా ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. 2018 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ సర్కారు నిరుద్యోగ భృతి బాకీ పడిందని, ప్రతి నిరుద్యోగికి రూ.లక్షా 20 వేలు నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు బీజేపీ విడిచి పెట్టబోదని హెచ్చరించారు. ఇన్నాళ్లుగా ఇదిగో నోటిఫికేషన్లు.. అదిగో రిక్రూట్ మెంట్లు అన్ని ప్రకటనలు చేసిన కేసీఆర్ మరోసారి మోసం చేశారని, ఈసారి అలా చేయబోమని కేసీఆర్ నమ్మకం కల్పించాలని బండి సంజయ్ అన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయడంతో కాదని, ఉద్యోగాలు ఇచ్చే వరకు (ముందస్తు) ఎన్నికలకు పోనని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యువతకు జాబ్స్ వచ్చే వరకు బీజేపీ వారికి అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన పాక్ యువతి

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే

అణు యుద్ధానికి దారి తీయొద్దనే చెర్నోబిల్‌ ఆక్రమణ