బోడుప్పల్ వక్ఫ్ బాధితులకు అండగా బీజేపీ : బండి సంజయ్

బోడుప్పల్ వక్ఫ్ బాధితులకు అండగా బీజేపీ : బండి సంజయ్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం బోడుప్పల్ లో వక్ఫ్ బాధితుల సమస్య పరిష్కారం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, 59 జీవో బాధితుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాధితులు ఏకమై ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉంటామని, ఎవరైనా అడ్డొస్తే వారి అంతు చూస్తాం అని వ్యాఖ్యానించారు. 

మంత్రి మల్లారెడ్డి జోకర్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. తనను విమర్శించే అర్హత డ్రైనేజీ మంత్రికి లేదన్నారు. హిందూ సమాజం సంఘటితం కోసం తాను బరాబర్ మాట్లాడతా అని చెప్పారు. 12 శాతం ఉన్న ఎంఐఎంకు 7 సీట్లు వస్తే.. 80 శాతం హిందువులు ఉన్న పార్టీకి ఎన్ని సీట్లు రావాలి..? అని ప్రశ్నించారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితేనే బోడుప్పల్ లోని సమస్య పరిష్కారమవుతుందన్నారు. 

నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్ర నాచారంలో జరుగుతున్నప్పుడు బోడుప్పల్ వక్ఫ్ బాధితులు బండి సంజయ్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితుల కోసం ‘ప్రజా గోస- బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా బోడుప్పల్ లోని మారుతినగర్ లో ఏర్పాటు చేసిన ‘వక్ఫ్ బాధితుల గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.