ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు

ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు

రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజల్లో విశ్వాసం నింపేందుకే సంగ్రామ యాత్ర చేపట్టినట్టు చెప్పారు. తన యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పువస్తుందన్నారు. రుణమాఫీ, ఉచిత యూరియా పేరుతో రైతులను కేసీఆర్ వంచించాడన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. నిరుద్యోగులకు కేసీఆర్ ఇస్తామని భృతి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో వరదలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు సంజయ్.  పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.

చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. చార్మినార్, మదీనా, బేగంబజార్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు యాత్ర చేరుకుంటుంది. అక్కడ లంచ్ కార్యక్రమం తర్వాత నాంపల్లి మీదుగా వెళ్తుంది. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు సంజయ్. సమీపంలోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం మీదుగా పాదయాత్ర నిర్వహిస్తారు. మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు సంజయ్.

అంతకు ముందు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్... ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ నేతలతో కలిసి గో పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతలతో కలిసి చార్మినార్ చేరుకున్న సంజయ్... భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఇవాళ, రేపు సిటీలోనే సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.. రోజుకు 10 కిలోమీటర్లు నడుస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు సంజయ్. ప్రజా సంగ్రామయాత్ర కోసం 30 కమిటీలను 6 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు.