
ఎంపీగా అవకాశం రావడమే గొప్ప.. మంత్రి పదవిపై ఆశలేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పన్నారు. బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత మొదటి సారిగా కరీంనగర్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.. లేదంటే పోరాటం చేస్తానన్నారు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో అనేక పనులు జరుగుతున్నాయన్నారు. అయితే అవన్నీ రాష్ట్ర పథకాలేనని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల ముందు వరకే రాజకీయాలన్న సంజయ్… ఇకపై అభివృద్ధి కోసం పనిచేద్దామని మిగతా పార్టీలను కోరుతున్నానన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడంతో పాటు.. గ్రామగ్రామాన బీజేపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. అంతేకాదు.. 29న హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తామని చెప్పారు.
పార్లమెంట్ సమావేశాలకు, కరీంనగర్ ప్రజల పనుల కోసం తప్ప ఢిల్లీ వెళ్లనని… ఇక్కడే ప్రజల మధ్య ఉంటానని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న స్మార్ట్ సిటీ పనులకోసం అవసరమైతే మరిన్ని నిధులు తెస్తామని తెలిపారు ఎంపీ బండి సంజయ్.