
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసీ ఓటర్ల జాబితా సవరణతో ఇప్పటికే బీహార్ పాలిటిక్స్ వేడెక్కగా.. తాజాగా మాజీ మంత్రి, ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ రాష్ట్ర రాజకీయాల్లో మరో బాంబ్ పేల్చారు. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని సంచలన ప్రకటన చేశారు.
శనివారం (జూలై 26) బీహార్ రాజధాని పాట్నాలో తేజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహువా స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అలాగే, ఈ సారి నితీష్ కుమార్ బీహార్ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. నెక్ట్స్ బీహార్‌లో ఏ ప్రభుత్వం ఏర్పడిన యువత, ఉపాధి, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెడితే ఆ గవర్నమెంట్కు తేజ్ ప్రతాప్ యాదవ్ సంపూర్ణ మద్దతు ఇస్తాడని తెలిపారు.
ALSO READ | అలాంటి ప్రభుత్వానికి మద్దతు బాధగా ఉంది..నితీష్‌పై చిరాగ్ పాశ్వాన్ ఫైర్
కాగా, బాధ్యతా రహితమైన ప్రవర్తన కారణంగా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను అతని తండ్రి, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నుంచి ఆరు సంవత్సరాలు బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా తేజ్ ప్రతాప్ యాదవ్ తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని సంచలన ప్రకటన చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. పార్టీ నుంచి బహిష్కరించడంతో తేజ్ ప్రతాప్ స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇందులో భాగంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహువా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. కాగా, మహువా అసెంబ్లీ సీటు ఆర్జేడీకి కంచుకోట. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధిగా మహువా నుంచి పోటీ చేసి విజయం సాధించాడు తేజ్ ప్రతాప్. హిందూస్థానీ అవామ్ మోర్చా (లౌకిక) అభ్యర్థి రవీంద్ర రేను ఓడించారు.
ప్రస్తుతం మహువా అసెంబ్లీ స్థానానికి ఆర్జేడీకి నేత ముఖేష్ కుమార్ రౌషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా మహువా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తేజ్ ప్రతాప్ ప్రకటించడంతో ఈసారి మహువా అసెంబ్లీ ఎన్నిక పోరు బీహార్ పాలిటిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ తేజ్ ప్రతాప్ చివరి వరకు ఇదే స్టాండ్ మీద నిలబడతారా లేదా చివర్లో కుటుంబ సభ్యులు బుజ్జగిస్తే రేసు నుంచి పక్కకు తప్పుకుంటారా అనేది చూడాలి.