
జింబాబ్వేలో జరుగుతున్న సిరీస్ ను న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది. శనివారం (జూలై 26) హరారే వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 3 పరుగులు తేడాతో గెలిచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి ఓవర్ లో సౌతాఫ్రికా విజయానికి 7 పరుగులు కావాలి. చేతిలో 5 వికెట్లు ఉండడంతో సఫారీల విజయం ఖాయమనుకున్నారు. అయితే ఈ దశలో కివీస్ ఫాస్ట్ బౌలర్ హెన్రీ మ్యాజిక్ చేశాడు. చివరి ఓవర్ లో రెండు వికెట్లు తీయడంతో పాటు మూడే పరుగులిచ్చి న్యూజిలాండ్ జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో కివీస్ ఓటమి లేకుండా ముగించింది.
సాంట్నర్ కెప్టెన్సీలో ఆడిన 5 మ్యాచ్ లు గెలిచింది. మరోవైపు సౌతాఫ్రికా ఈ లీగ్ లో న్యూజిలాండ్ పై ఆడిన మూడు మ్యాచ్ ల్లోనే ఓడిపోయింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కాన్వే (47), రచీన్ రవీంద్ర (47) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సీఫెర్ట్ 30 పరుగులు చేసి రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి రెండు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు.
భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 177 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ మొత్తం సౌతాఫ్రికా చేతిలో ఉన్నప్పటికి చివరి ఓవర్లో ఆ జట్టు ఆశ్చర్యకరంగా ఓడిపోయింది. ఓపెనర్లు లూవాన్-డ్రే ప్రిటోరియస్ (51),రీజా హేన్ద్రిక్స్ (37) తొలి వికెట్ కు 9.4 ఓవర్లలోనే 94 పరుగులు జోడించి జట్టుకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ లో డెవాల్డ్ బ్రెవిస్ 16 బంతుల్లోనే 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి విజయం అంచుల వరకు తీసుకొచ్చాడు. అయితే చివరి ఓవర్లో బ్రేవీస్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా ఓడిపోయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు హెన్రీకి దక్కాయి.
NEW ZEALAND WITH A STEAL TO CLINCH THE SERIES!
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
Two incredible catches in that final Matt Henry over and South Africa are left wondering...https://t.co/n4BYzLAd1m pic.twitter.com/p5IK9zspfg