ఓడిపోతాననే డిప్రెషన్లో కేసీఆర్ ఏదేదో చేస్తున్నడు : బండి సంజయ్

ఓడిపోతాననే డిప్రెషన్లో కేసీఆర్ ఏదేదో చేస్తున్నడు : బండి సంజయ్

మునుగోడులో టీఆర్ఎస్ నాయకులు ఒక్కో ఓటుకు రూ.10వేల నుంచి రూ.15వేల దాకా పంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ధన బలంతో మునుగోడులో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నడని మండిపడ్డారు. అతికొద్ది మీడియా సంస్థలు మాత్రమే ఈ ధన ప్రవాహం బాగోతాన్ని బయటపెట్టాయని తెలిపారు. మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ ఓడిపోతుందనే డిప్రెషన్ లో కేసీఆర్ ఉన్నడు. అందుకే రోజూ పోలీసులకు ఆదేశాలు ఇస్తుండు. ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నడు.  బండి సంజయ్ అరెస్టు వార్తకు కవరేజీ ఇవ్వొద్దని మీడియాపై కూడా కేసీఆర్ ఒత్తిడి చేసిండు. అందువల్లే ఆ వార్తను చాలా మీడియా సంస్థలు ప్రసారం చేయలేదు’’ అని సంజయ్ కామెంట్ చేశారు. ‘‘స్వయంగా ముఖ్యమంత్రే రౌడీయిజం  చేయండి.. గూండాయిజం చేయండి అని టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నడు. అందుకే బీజేపీ కార్యకర్తలపై, నాయకులపై వాళ్లు దాడులు చేశారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా దగ్గరుండి ఈ దాడులు చేయించారు. అయినా మేం సహనం కోల్పోలేదు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. బీజేపీ వైపే జనం ఉన్నారు’’ అని పేర్కొన్నారు.  

‘‘మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారనే దానిపై పోలీసులకు బీజేపీ కార్యకర్తలు సమాచారమిస్తే..  వెంటనే వాళ్లు టీఆర్ఎస్ లీడర్లకు ఫోన్ చేసి సమాచారాన్ని లీక్ చేస్తు్న్నారు. నాన్ లోకల్స్ పారిపోయేందుకు సమయం దొరికేలా సహకరిస్తున్నరు’’ అని సంజయ్ చెప్పారు. ‘‘మా కార్యకర్తలను కాపాడుకోవడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి మునుగోడుకు వస్తే అనేక ప్రాంతాల్లో నన్ను అడ్డుకున్నరు. చివరకు అరెస్టు చేశారు. బీజేపీ కార్యకర్తల్ని అర్ధరాత్రి పోలీసు స్టేషన్ కు ఈడ్చుకొచ్చారు. కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. మీడియా , పోలీసులు, ఎన్నికల కమిషన్ సీఎం చేతిలో ఉన్నాయి. సామాన్య ప్రజలకు రక్షణ లేకుండాపోయింది. ఎన్నికల కమిషన్ మీద ప్రజలకు నమ్మకం లేకుండాపోయింది. ఎన్నికల కమిషన్ నిజాయితీగా వ్యవహరించాలి’’ అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.