
- టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడం: బండి సంజయ్
నల్గొండ, వెలుగు: టీఆర్ఎస్ బెదిరింపులకు తాము భయపడేది లేదని, తెగించి కొట్లాడుతామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. పోలీస్స్టేషన్లలోనూ బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శనివారం నల్గొండలోని జిల్లా బీజేపీ ఆఫీసులో నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల జోనల్ మీటింగ్కు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మూర్ఖపు పార్టీని ప్రజలు, బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని, ఇక్కడ బెంగాల్ తరహా పాలన సాగదని హెచ్చరించారు. పోలీస్స్టేషన్లను టీఆర్ఎస్ నాయకులు పంచాయితీ, సెటిల్మెంట్లకు అడ్డాలుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులకు డీజీపీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం
కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో బీజేపీని నిందించి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి రాజకీయ లబ్ధిపొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని సంజయ్ అన్నారు. కేంద్ర పథకాలు అమలు చేయకుండా ఇక్కడి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అంటే కేసీఆర్ ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ టీఆర్ఎస్ పెద్దలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో రోడ్లు, బియ్యం, రైల్వే ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్, మరుగుదొడ్లు తదితర వాటిన్నింటినీ మోడీ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. కాగా.. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో బీజేపీ బలం, బలహీనతలు, సంస్థాగత నిర్మాణంపై బీజేపీ జాతీయ సంస్థాగత జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాశ్ దిశానిర్దేశం చేశారు.