సర్పంచ్లు బీజేపీలో చేరాలనుకుంటే ఈ నెల 18లోపు డెడ్లైన్: బండి సంజయ్

సర్పంచ్లు బీజేపీలో చేరాలనుకుంటే ఈ నెల 18లోపు డెడ్లైన్: బండి సంజయ్
  • ఆ తర్వాత చేర్చుకోం: కేంద్ర మంత్రి బండి సంజయ్​
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచులు నామోషీ అయ్యేలా బీజేపీ సర్పంచుల ఊర్లను అభివృద్ధి చేస్త
  • గ్రామాల్లో డెవలప్​మెంట్​ పనులన్నీ కుంటుపడ్డయ్​
  • రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్య

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతు గెలిసిన సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లు బీజేపీలోకి వస్తే.. ఆయా గ్రామాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అయితే, ఈ నెల 18లోపు మాత్రమే ఆయా పార్టీల సర్పంచ్​లు బీజేపీలో చేరడానికి డెడ్ లైన్ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత వస్తామని చెప్పినా ఎవరినీ బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కరీంనగర్​లోని రాజశ్రీ గార్డెన్​లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ బలపర్చిన సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లను బండి సంజయ్​ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్​లు అసూయ పడేలా బీజేపీ సర్పంచ్​లు ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తాను.

ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని, ఖర్చు చేస్తున్న నిధులను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్​లో ఎందుకు ఉన్నామా? అని ఆయా పార్టీల సర్పంచ్​లు నామోషీ అయ్యేలా చేస్త. రాబోయే రోజుల్లో సర్పంచ్​లపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చే అవకాశముంది. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ కుంటుపడ్డాయి. తట్టెడు మట్టి ఎత్తి పోయడానికి కూడా పైసల్లేవు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయాపైసా ఇచ్చే పరిస్థితి లేదు” అని వ్యాఖ్యానించారు. అయినా, బీజేపీ సర్పంచ్​లు ఎవరూ బాధపడొద్దని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు. 

ఎంపీ ల్యాడ్స్, సీఎస్సార్ ఫండ్స్ తోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తానని ఆయన తెలిపారు. దీంతోపాటు రెండో, మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిని గోపి, నాయకులు చెన్నమనేని వికాస్ రావు తదితరులు పాల్గొన్నారు.