
స్టైల్గా మాట్లాడటం నాతో కాదు.. నేను మాస్ లీడర్ నే. మీరు కూడా క్లాస్ లో మాస్ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మే 27వ తేదీ శనివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) స్నాతకోత్సవలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరై సీఏలో పాసైన యవకులను ఉద్దేశించి మాట్లాడారు.
"ఇంత మంచి కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది. భారత జాతి నిర్మాతలైన మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ దేశానికి పేరు రావాలని సీఏ చేసిన వ్యక్తులు మీరు. సీఏ టఫ్ కోర్స్. నూటికి ఒక్కరు కూడా పాస్ కాలేని పరిస్థితి ఉంటది. కానీ మీరంతా పట్టుదల, కసితో పాసయ్యారు. మోడీ పేరు చెబితే అంతా చప్పట్లు కొడుతున్నరు. ఒక దేశ ప్రధాని మోడీ ది బాస్ అంటే.. ఇంకో ప్రధాని ఏకంగా పాదాభివందనం చేస్తున్నారు. విదేశాల్లో ప్రధానికి గౌరవం దక్కిందంటే అది మనందరికీ గౌరవం దక్కినట్లే.. కానీ కొన్ని పార్టీలు ఆయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నం చేయడం బాధాకరం.
గతంలో ఇదే మోడీకి పాస్ పోర్టు ఇవ్వబోనని నిరాకరించిన దేశాలే.. ఇయాళ రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలుకుతున్నాయి. నిరంతరం దేశం ఆలోచించే మోడీ నాయకత్వంలో నేను ఎంపీగా ఉన్నందుకు గర్వంగా ఉంది. నన్ను ఎంపీగా చేసిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటాను. మోడీ పీఎం అయ్యాక దేశ ఎకానమీ గ్రోత్ విపరీతంగా పెరగింది. ఆజాద్ కా అమ్రుతోత్సవం నుండి అమ్రుత్ కాల వైపు పయనిస్తున్నాం. ఇయాళ దేశ ఆర్దిక పరిస్థితి గతంలో 10వ స్థానంలో ఉండే... ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చినం. 2047 నాటికి భారత్ నెంబర్ వన్ చేసేందుకు క్రుషి చేస్తున్నారు.
సీఏ అంటే అకౌంట్స్ చేసేవాళ్లు మాత్రమే కాదు... మాలాంటి సామాన్యులంతా 10 మైనస్ 2 అంటే 8 అని చెబుతాం... మీరు మాత్రం మీకెంత కావాలో చెప్పండి అని అంటారు.కానీ మీరంతా ఈ దేశ భవిష్యత్తు తలరాతను మార్చే సత్తా మీకే ఉంది. మీ క్లయింట్స్ సకాలంలో పన్నులు కట్టేలా చూడండి. బ్లాక్ మనీని అరికట్టండి. వారికి సిస్టమ్ తో సమస్యలొస్తే... వాటిని తొలగించి సంస్థ ఉన్నతికి తోడ్పడండి. ఇయాళ విదేశీ పెట్టుబడులు మాతోనే వచ్చాయని రాజకీయ నాయకులుగా మేం చెప్పుకుంటాం... కానీ మీవల్లే పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇండియా అంటే సేఫ్ జోన్ గా చూపాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒక బిజినెస్ చేయాలంటే ఈ ప్రాంతం సేఫ్ జోనా? కాదా? పొరపాటున నష్టాలొస్తే ఇబ్బందులు పెడతారా? అనుకోకుండా నష్టాలొస్తే సేఫ్ గా ఎగ్జిట్ కావొచ్చా? అని విదేశీయలు చూస్తారు. ఆ నమ్మకం మీరు కలిగించాలి.
ఈ దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు మీరు. మీ క్లయింట్లను ప్రోత్సహిస్తూ కట్టిస్తున్న పన్నుల వల్లే ఈ దేశంలో 80 కోట్ల మంది పేదలకు మూడు పూటల భోజనం అందిస్తున్నారు. 3 కోట్ల మందికి ఇండ్లు కట్టిస్తున్నాం. జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేలా టాయిలెట్లు కట్టించాం. దయచేసి భయపడకండి. కసితో పనిచేయండి. అనుకున్న లక్ష్య సాధన కోసం ఎంత కష్టమైనా అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. నేను భయపడను. ఇప్పటి వరకు 7 సార్లు జైలుకు పోయిన. నాపై చాలా కేసులున్నయ్. ఎంతో మంది హేళనగా చూసేవాళ్లు... అయినా భయపడే వ్యక్తిని నేను కాదు... నేను ప్రతి క్షణం ఈ దేశం, ధర్మం, పేదల కోసం పనిచేయాలనే తపనతోనే ముందుకు వెళతాను" అని బండి సంజయ్ పేర్కొన్నారు.