ఎంఎంటీఎస్​కు పైసలెందుకియ్యలే?

ఎంఎంటీఎస్​కు పైసలెందుకియ్యలే?

మల్కాజిగిరి, వెలుగు: గిరిజన రిజర్వేషన్లపై తూతూమంత్రంగా జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటే కేసీఆర్​ను వదిలిపెట్టబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ‘‘కేసీఆర్.. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్లను10 శాతానికి పెంచుతూ జీవో తెచ్చి అమలు చేస్తానన్నవ్. కేంద్రంతో సంబంధం లేదన్నవ్. మరి ఇన్నేళ్లుగా ఎందుకు అమలు చేయలేదు? కేంద్రం అడ్డుకుంటోందని అబద్ధాలు ఎందుకు చెప్పినవ్?” అని ఆయన మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 6వ రోజున మల్కాజిగిరి చౌరస్తా నుంచి బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

ఎస్టీ రిజర్వేషన్ల పెంపును వెంటనే అమలు చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్17ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరుతో ఘనంగా నిర్వహించిందని, సీఎం కేసీఆర్ మాత్రం.. ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరుతో నిర్వహించి, నిజాం అరాచకాల గురించి కనీసం నోరెత్తలేదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను విస్మరించిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.   

‘పోడు’ సమస్యనెందుకు పరిష్కరించలే? 

కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి.. ఇప్పటివరకు ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎనిమిదేండ్లుగా పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. గుర్రంపోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలను కొట్టి, జైలులో పెట్టారని.. ఎస్టీలపై దౌర్జన్యకాండ చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. లిక్కర్ స్కాం, శాండ్, డ్రగ్స్ మాఫియా, క్యాసినో.. ఇలా అన్ని స్కాంలలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు.  

అన్ని వర్గాలకూ మోసం 

రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే  దక్కుతుందని బండి సంజయ్ విమర్శించారు. కులవృత్తులను నాశనం చేశారని, గొర్రెల స్కీమ్.. ఒక పెద్ద స్కాం అని ఆరోపించారు. సఫిల్ గూడలో జరిగిన బస్తీ సంపర్క్ అభియాన్ లోనూ ఆయన పాల్గొన్నారు. బీజేపీ బీసీలు, దళితుల అభ్యున్నతికి పాటుపడుతోందని చెప్పారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు బండి సంజయ్​ని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. మచ్చబొల్లారం డివిజన్​కు చెందిన పలువురు మహిళలు, యువకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. పాదయాత్రలో బీజేపీ రాష్ర్ట వ్యవహారాల కోఇన్​చార్జ్ అరవింద్ మీనన్, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు, పార్టీ నేతలు హరీష్​రెడ్డి, భానుప్రకాష్, కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, సునీత, శ్రీనివాస్​ పాల్గొన్నారు.  

కేసీఆర్ దళిత ద్రోహి

‘‘నిరుద్యోగ భృతి, దళిత బంధు హామీలు ఏమయ్యాయి?125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టాడా? అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కూడా కేసీఆర్ బయటకు రాడు. ఆయన దళిత ద్రోహి” అని సంజయ్ మండిపడ్డారు. మల్కాజిగిరిలో ఎక్కడికి వెళ్లినా సమస్యలే కన్పిస్తున్నాయని బండి సంజయ్ చెప్పారు. ‘‘ఇక్కడ చేతి గుర్తుకు, కారు గుర్తుకు ఓటేశారు. ఇక్కడ ఎవరికైనా ఇండ్లు వచ్చాయా? మీరు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ఏం చేశారు? తెలంగాణకు మోడీ మంజూరు చేసిన 2.4 లక్షల ఇండ్లను ఎందుకు కట్టించ లేదు?” అని ప్రశ్నించారు.

మల్కాజిగిరిలో ఎంఎంటీఎస్ కోసం కేంద్రం రూ.600 కోట్లు మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.430 కోట్లు కాదు కదా ఒక పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఎంఎంటీఎస్ తో ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. మల్కాజిగిరిలోని 222 సర్వేనంబర్​లో ఏడు ఎకరాలను టీఆర్ఎస్ కబ్జా చేసిందని ఆరోపించారు. ఇక్కడ పెద్ద సర్కారు ఆసుపత్రి కూడా లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.