కరోనాను ఖతం చేసే నాసల్​ స్ప్రే

కరోనాను ఖతం చేసే నాసల్​ స్ప్రే

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మన దేశంలో అయితే మహమ్మారి సెకండ్​ వేవ్​ తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్​ను చంపేందుకు అన్ని రకాల రీసెర్చ్​లను సైంటిస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బంగ్లాదేశ్​సైంటిస్టులు ఒక నాసల్​ స్ప్రేని డెవలప్​ చేశారు. ఈ స్ప్రేని పీల్చితే కరోనా ఖతం అయిపోతుందని వారు చెబుతున్నారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు బంగ్లాదేశ్​ ప్రభుత్వం బంగ్లాదేశ్​ రిఫరెన్స్​ ఇనిస్టిట్యూట్​ ఫర్​ కెమికల్​ మెజర్​మెంట్స్(బీఆర్ఐసీఎం)ని ఏర్పాటు చేసింది. బీఆర్ఐసీఎం సైంటిస్టులు తాజాగా బంగాసేఫ్​ ఓరో నాసల్​ స్ప్రేని డెవలప్​ చేశారు. ముక్కు, నోరు, కళ్ల ద్వారా వ్యాపిస్తున్న వైరస్​ను అడ్డుకోగలదని చెబుతున్నారు. త్వరలోనే కరోనాను అంతం చేసే సామర్థ్యం కలిగిన నాసల్ స్ప్రేని ప్రవేశపెడతామని బీఆర్ఐసీఎం డైరెక్టర్ జనరల్​ డాక్టర్ మలా ఖాన్​ చెప్పారు. క్లినికల్​ ట్రయల్స్​ కోసం బంగ్లాదేశ్​ మెడికల్​ రీసెర్చ్​ కౌన్సిల్​ నుంచి మార్చి 24న అనుమతి వచ్చిందని, త్వరలోనే ట్రయల్స్ పూర్తవుతాయని ఆమె చెప్పారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఈ నాసల్​ స్ప్రేని తయారు చేశామని, దాని ధర అందరికీ అందుబాటులో ఉంటుందని, ప్రొడక్షన్​ కాస్ట్ ను బట్టి స్ప్రే రేటును నిర్ణయిస్తామని చెప్పారు. కరోనా పాజిటివ్​ వచ్చిన పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి కూడా ఈ స్ప్రే ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. త్వరలోనే ఇది మార్కెట్​లోకి వస్తుందన్నారు.