ఇస్కాన్ చిన్మయ్ దాస్‌కు బెయిల్

 ఇస్కాన్ చిన్మయ్ దాస్‌కు బెయిల్

ఢాకా: ఇస్కాన్ కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ కు బంగ్లాదేశ్‌ హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. బంగ్లా జెండాను అగౌరవపర్చారనే ఆరోపణలతో ఆయనతో సహా 18 మందిపై గతేడాది అక్టోబర్ 31న చట్టోగ్రామ్‌లోని కోట్వాలీ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆయన్ను నవంబర్ 25న అరెస్టు చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 

ఆయన తరఫున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాది సైఫుల్ ఇస్లాంపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో చిన్మయ్ దాస్‌ భద్రతపై భారత్‌ పలు మార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అరెస్టైన తర్వాత ఎన్నిసార్లు న్యాయస్థానాల్లో బెయిల్‌ కోసం ప్రయత్నించినా లభించలేదు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. న్యాయమూర్తులు అతోర్ రెహ్మాన్, అలీ రెజాలతో కూడిన డివిజన్ బెంచ్ బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.