
- ఇండియాలో బంగ్లా ప్రధాని నాలుగు రోజుల పర్యటన
- డిఫెన్స్, ట్రేడ్, నదీ జలాల పంపకాలపై చర్చలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశంలో 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి దర్మనా జర్దోశ్ స్వాగతం పలికారు.షేక్ హసీనా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఆరిందం బాగ్చీ చెప్పారు. షేక్ హసీనా ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. డిఫెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్, ఎనర్జీ సెక్టార్లో పరస్పర సహకారం, ఉమ్మడి నదీ జలాల పంపకాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత నిర్వహణ, డ్రగ్స్ అక్రమ రవాణ నియంత్రణ మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రివర్ వాటర్ షేరింగ్ విషయంలో పోయిన నెలలో చేసుకున్న అగ్రిమెంట్‌ను మంగళవారం ఫైనల్ చేయనున్నారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) నిర్వహించే ఓ బిజినెస్ సమ్మిట్ కు ఆమె హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్తో ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. చివరి రోజైన గురువారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్తారు. అక్కడ సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శిస్తారు. షేక్ హసీనా బృందంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, వాణిజ్య, రైల్వే మంత్రి, ఆర్థిక వ్యవహారాల సలహాదారు ఉన్నారు. హసీనా చివరి సారిగా 2019 అక్టోబర్‌లో ఇండియాలో పర్యటించారు. నిరుడు మార్చిలో నిర్వహించిన 50 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకలకు నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ వెళ్లొచ్చారు.