Asia Cup 2025: లిటన్ దాస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ అలవోక విజయం

Asia Cup 2025: లిటన్ దాస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ అలవోక విజయం

ఆసియా కప్ లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గురువారం (సెప్టెంబర్ 11) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హాంకాంగ్ పై ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో సమిష్టిగా రాణించడంతో పాటు ఛేజింగ్ లో జాగ్రత్తగా ఆడుతూ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఛేజింగ్ లో కెప్టెన్ లిటన్ దాస్ (39 బంతుల్లో 59: 4 ఫోర్లు, సిక్సర్), తోహిద్ హ్రిడోయ్ (35) భారీ భాగస్వామ్యంతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. యూఏఈ బౌలర్లలో అతీఖ్ ఇక్బాల్ రెండు వికెట్లు.. ఆయుష్ శుక్లా ఒక వికెట్ పడగొట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి గెలిచింది. 144 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మంచి ఆరంభం లభించలేదు. తంజిద్ హసన్ తమీమ్ 14 పరుగులకే చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ (19) కూడా పెవిలియన్ కు చేరాడు. పవర్ ప్లే లో 51 పరుగులు చేసి పర్వాలేదనిపించిన బంగ్లాదేశ్ ఆ తర్వాత నిదానంగా ఆడింది. కొట్టాల్సిన రన్ రేట్ తక్కువగా ఉండడంతో లిటన్ దాస్, హ్రిడోయ్ జాగ్రత్తగా ఆడి జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 69 బంతుల్లోనే 95 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. 

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన మొదట బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 42 పరుగులు చేసిన నిజాకత్ ఖాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. యాసిమ్ ముర్తాజా (28), ఓపెనర్ జీషన్ (30) అలీ రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, రిషద్ హుస్సేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి 7 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే చేసిన హాంకాంగ్ చివరి 13 ఓవర్లలో 106 పరుగులు చేసి బంగ్లాదేశ్ ముందు ఫైటింగ్ టోటల్ ఉంచింది.