బెదిరించేందుకే గన్ కొన్నానని అంగీకరించిన ప్రసాద్

బెదిరించేందుకే గన్ కొన్నానని అంగీకరించిన ప్రసాద్

హైదరాబాద్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.  ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడు ప్రసాద్ గౌడ్తో పాటు అతని భార్య లావణ్య గౌడ్ ను ఏ2గా చేర్చారు. ఇదిలాఉంటే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసుకు సంబంధించిన విచారణలో పలు కీలక అంశాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.  నిందితుడు ప్రసాద్ రూ.32వేలు చెల్లించి మహారాష్ట్ర నాందేడ్ లో గన్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. గన్ కొనుగోలుకు సహకరించిన ప్రసాద్ స్నేహితులతో పాటు డీలర్ సంతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

గ్రామంలో తనను ఒంటరి చేసిన టీఆర్ఎస్ నాయకులను బెదిరించేందుకే గన్ కొనుగోలు చేసినట్లు నిందితుడు ప్రసాద్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ప్రసాద్ ఎమ్మెల్యేను కలవాలని చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించారు. అయితే ప్రసాద్ ను చూసిన ఎమ్మెల్యే ఎందుకు వచ్చావని  తిడుతూ బయటకు పంపే ప్రయత్నం చేశారు. దీంతో జీవన్ రెడ్డి, ప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రసాద్ ను నెట్టేయడంతో అతని వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన ఆయన సిబ్బందితో కలిసి ప్రసాద్ ను నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు.