
వికారాబాద్, వెలుగు: బ్యాంకులో ఖాతాదారులు దాచుకున్న సొమ్మును అందులో పనిచేసే ఉద్యోగే కాజేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోటుచేసుకున్నది. తాండూర్ శాఖలో విశాలాక్షి అనే మహిళ కొన్నేళ్ల క్రితం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది. మెచ్యూరిటీ గడువు ముగియడంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది. ఇంతకుముందే డబ్బులు మీ ఖాతా నుంచి విత్ డ్రా అయినట్లు చూపిస్తుందని మేనేజర్ చెప్పడంతో ఆమె అవాక్కైంది.
దీంతో ఆమె గొడవ పెట్టడంతో బ్యాంకు మేనేజర్ అందులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ పై అనుమానంతో పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలీలో విచారించారు. దీంతో తానే డబ్బులు కాజేసినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. మొత్తం రెండు అకౌంట్ల నుంచి రూ.6 లక్షల 4 వేలు మాయం అయినట్లు గుర్తించామని తెలిపారు. ప్రేమ్‌కు ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు.