అప్పు చెల్లించలేదని రైతు పొలంలో బ్యాంకోళ్ల ఎర్రజెండాలు

అప్పు చెల్లించలేదని రైతు పొలంలో బ్యాంకోళ్ల ఎర్రజెండాలు

సకాలంలో అప్పు చెల్లించలేదని భూమి స్వాధీనం

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వరంగల్‌‌‌‌ డీసీసీబీ స్టాఫ్​

రైతు భూమి వేలం పాటకు ఆర్డర్‌‌‌‌

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మొగుళ్లపల్లి, వెలుగు: దున్నేవాడిదే భూమి నినాదంతో  భూస్వాముల భూముల్లో నక్సలైట్లు, సర్కారు భూముల్లో లెఫ్ట్​పార్టీల లీడర్లు గతంలో ఎర్రజెండాలు పాతడం చూశాం. అయితే తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదనే కారణంతో వరంగల్‌‌‌‌ డీసీసీబీ అధికారులు రైతు భూమిలో ఎర్రజెండాలు పాతి, వేలం పాట పెట్టబోతున్నట్లు ఫ్లెక్సీలు కట్టిన ఘటన గురువారం జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి చెందిన గుర్రపు తిరుపతిరెడ్డి తన 8 ఎకరాల వ్యవసాయ భూమిని వరంగల్‌‌‌‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), పరకాల బ్రాంచిలో తాకట్టు పెట్టి 2017 సెప్టెంబర్ 7న రూ.10 లక్షల లోన్‌‌‌‌ తీసుకున్నారు. ఆరు నెలలకు రూ.1.32 లక్షల చొప్పున వాయిదా పద్ధతిలో 2022 వరకు అసలు, వడ్డీ కలిపి మొత్తం డబ్బు చెల్లిస్తానని అంగీకరించాడు. మూడేళ్లలో రూ.5.55 లక్షల అప్పు చెల్లించారు. గడువు పూర్తి కాకపోయినప్పటికీ వాయిదా పద్ధతి ప్రకారం డబ్బు కట్టనందున రూ.5 లక్షల ఓవర్‌‌‌‌ డ్యూ అయ్యిందని పేర్కొంటూ వరంగల్‌‌‌‌ డీసీసీబీ ఆఫీసర్లు నేరుగా రంగంలోకి దిగారు. డీసీసీబీ సేల్స్ ఆఫీసర్ పి.స్రవంతి, నోడల్ ఆఫీసర్ వాణి, ఫీల్డ్ ఆఫీసర్ బాలకృష్ణ కలసి రైతు తిరుపతిరెడ్డి తాకట్టు పెట్టిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి  హద్దులను గుర్తించి ఎర్రజెండాలు పాతారు. అంతేకాకుండా 1964 సహకార చట్టం అనుసరించి భూమిని వేలం వేయనున్నట్లు  స్వయంగా ఫ్లెక్సీ కూడా కట్టారు. ఈ నెల 28న మొగుళ్లపల్లి జీపీ ఆఫీస్ లో వేలంపాట నిర్వహిస్తామని, ఆసక్తి కలవారు పాల్గొని భూమిని పొందవచ్చని పరకాల బ్రాంచ్ మేనేజర్ స్రవంతి పేర్కొన్నారు. బ్యాంకు తనఖాలో ఉన్న మొత్తం భూమికి ప్రభుత్వ రేట్‌‌‌‌ ప్రకారం వేలం వేస్తామని బ్యాంకు అప్పు తీరేంత డబ్బులు వచ్చిన తర్వాత మిగిలిన భూమిని తిరిగి రైతుకు అప్ప చెబుతామని చెప్పారు.

నా ఇజ్జత్​ తీసిన్రు

పంట పెట్టుబడి కోసం నా పొలం కుదువ పెట్టి రూ.10 లక్షల అప్పు తీసుకున్న మాట నిజమే. కానీ కొన్నేండ్లుగా అకాల వర్షాలు, అనావృష్టితో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతితో వాగు పక్కన ఉన్న నా పొలం మొత్తం కొట్టుకుపోయింది. పంటలు చేతికి అందక దిగుబడి రాలేదు. అయినప్పటీకీ బయట అప్పో సొప్పో చేసి రూ.5.55 లక్షలు చెల్లించా. గడిచిన 10 నెలల్లోనే రూ.4 లక్షలు కట్టా. అయినా బ్యాంకు అధికారులు నా భూమిలో ఎర్ర జెండాలు పాతి నా ఇజ్జత్​తీశారు.

– గుర్రపు తిరుపతిరెడ్డి, మొగుళ్లపల్లి, భూపాలపల్లి జిల్లా

For More News..

కరోనాతో భర్త.. తట్టకోలేక బిల్డింగ్ పైనుంచి దూకి భార్య..