
- కరోనాను సాకుగా చూపి గత ప్రభుత్వ నిర్ణయం
- పైనుంచి ఉత్తర్వులు రావడంతోనే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు గ్యారంటీలు రిలీజ్ చేసినం
- కాళేశ్వరం కమిషన్ ముందు సీఈ వెంకటరమణారెడ్డి వెల్లడి
- బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలే..
- కానీ, నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టోర్ చేశామని ప్రస్తావన
- అన్నారం బ్యారేజీ అలైన్మెంట్లో తేడాలున్నయ్: ఈఈ యాదగిరి
- 11 మీటర్ల మేర నీటిని స్టోర్ చేసి ఎత్తిపోసేలా ఒత్తిడి తెచ్చారని వెల్లడి
- రెండు మూడు నెలలకోసారి బ్యారేజీ పరిశీలించినం: క్యూసీ రిటైర్డ్ సీఈ వెంకటేశ్వర్లు
హైదరాబాద్, వెలుగు: కరోనాను సాకుగా చూపి మేడిగడ్డ ప్రారంభానికి ముందే కాంట్రాక్ట్ ఏజెన్సీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చిందని కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్కు సీఈ వెంకటరమణా రెడ్డి తెలిపారు. ‘‘బ్యాంకు గ్యారంటీలను రిలీజ్ చేయాలని గత సర్కారు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులతోనే నాడు ఏజెన్సీలకు బ్యాంకు గ్యారంటీలను తిరిగి ఇచ్చాం’’ అని వెల్లడించారు. శనివారం క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్.. క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, మేడిగడ్డ బ్యారేజీకి పనిచేసిన రిటైర్డ్ ఇంజినీర్లతోపాటు మేడిగడ్డ ఈఈ, మహబూబ్‌నగర్ సీఈలను విచారించారు.
‘‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చింది ‘హెడ్ ఆఫ్ ది స్టేట్’.. బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించాలని నాటి సీఈకి ఆయన ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాల మేరకే నాటి రామగుండం సీఈ బి. వెంకటేశ్వర్లు బ్యారేజీకి టెక్నికల్అనుమతులు మంజూరు చేశారు.. పై నుంచి ఆదేశాల్లేకుండా బ్యారేజీని మేమెలా నిర్మిస్తాం?’’ అని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలేనని, కానీ, నీటిని స్టోర్ చేయాలంటూ పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఫుల్రిజర్వాయర్ లెవెల్వరకు నీటిని నిల్వ చేయాలని చెప్పారన్నారు. అందులో తమ తప్పేం లేదని స్పష్టం చేశారు. బ్యారేజీ నిర్మాణాన్ని నాడు రూ.1,849.30 కోట్లు, దాని మీద 2.7% అదనంగా అగ్రిమెంట్అమౌంట్తో ప్రారంభించారని తెలిపారు.
కాంట్రాక్ట్ సంస్థ విజ్ఞప్తితోనే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ఇంజినీర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్టు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారని, దానిపై తాను కేవలం సంతకం మాత్రమే చేశానని వివరించారు. 2019 నుంచే మూడు బ్యారేజీల్లోనూ సీపేజీ ఏర్పడిందని పేర్కొన్నారు. 2019లోనే మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయని తెలిపారు. నిర్మాణం కోసం పునాదులను తవ్వాక ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఉమాశంకర్అనే ప్రొఫెసర్‌తో లోపాలపై విశ్లేషించే వాళ్లమని పేర్కొన్నారు.
పలుసార్లు ఉమాశంకర్ బ్యారేజీని పరిశీలించి, 3, 4, 5 బ్లాకుల్లో లోపాలున్నట్టు చెప్పారని తెలిపారు. మూడో బ్లాక్‌లో ఇసుకకు బదులు ఇసుక, సిమెంట్‌ను 1:3 పాళ్లలో మిక్స్ చేసి వేయాల్సిందిగా చెప్పారని గుర్తుచేశారు. నాలుగు, ఐదో బ్లాకుల్లో ఎం15 సిమెంట్కాంక్రీట్తో పటిష్టం చేయాలని చెప్పారన్నారు. ఆపరేషన్అండ్మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) విఫలమవడం వల్లే బ్యారేజీ కుంగిందని తేల్చి చెప్పారు.
అలైన్మెంట్లో తేడాలు: ఈఈ యాదగిరి
అన్నారం బ్యారేజీ డిజైన్ అలైన్మెంట్లో తేడాలున్నాయని, దాని వల్ల బ్యారేజీకి సమస్యలు వస్తున్నాయని అన్నారం బ్యారేజీ ఈఈ యాదగిరి తేల్చి చెప్పారు. బ్యారేజీ క్రాస్సెక్షన్112 మీటర్ల నుంచి 103 మీటర్ల తేడాతో ఉన్నదని వివరించారు. నాలుగేండ్లూ బ్యారేజీని మూసేసి సుందిళ్లకు లిఫ్ట్ చేశామని, మళ్లీ సుందిళ్ల నుంచి ఇక్కడికే తిప్పిపోతల్లాగా వదిలారని పేర్కొన్నారు. 11 మీటర్ల మేర నీటిని స్టోర్ చేసి, నీటిని ఎత్తిపోసేలా తనపై ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల సూచన మేరకు బ్యారేజీ గేట్లన్నింటినీ ఎత్తామని, ఇటీవల వచ్చిన వరదతో అన్నారం బ్యారేజీకి ఎగువన, దిగువన 7 మీటర్ల మందంతో ఇసుక కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని చెప్పారు. దానిని తొలగించడం సవాల్‌గా మారిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీ గేట్లను మూయడం కూడా కష్టమేనని తేల్చి చెప్పారు.
బ్యారేజీని డిజైన్ల ప్రకారమే నిర్మించామని స్పష్టం చేశారు. అయితే, అందులో లోపాలున్నాయని చెప్పారు. వరద ప్రవాహవేగాన్ని 5 మీటర్లు/సెకన్‌గా ఉంచి పరీక్షలు చేశారని, కానీ, ఇప్పుడు బ్యారేజీ వద్ద 18 మీటర్లు/సెకన్‌గా వరద ప్రవాహ వేగం ఉంటున్నదని, ఫలితంగా డౌన్ స్ట్రీమ్‌లో నీటిని నిల్వ చేసే స్టిల్లింగ్ బేసిన్లో వరద పడకుండా బయటకు నెట్టుకొస్తున్నదని పేర్కొన్నారు. స్టిల్లింగ్బేసిన్ను రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ ఎఫ్ఆర్ఎల్కు అన్నారం బ్యారేజీ 8 కిలోమీటర్ల దూరమే ఉండడంతో.. బ్యారేజీకి దిగువన ఉండే టెయిల్ వాటర్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయన్నారు.
సమస్యలు గుర్తించినం: రిటైర్డ్ సీఈ వెంకటేశ్వర్లు
బ్యారేజీ క్వాలిటీ కంట్రోల్లో పెద్దగా డిఫెక్ట్స్ ఏమీ లేవని క్వాలిటీ కంట్రోల్ విభాగం రిటైర్డ్ సీఈ బేతు వెంకటేశ్వర్లు చెప్పారు. చిన్న చిన్న లోపాలను గుర్తించినా.. వాటిని వెంటనే సరి చేశామని కమిషన్ ముందు వెల్లడించారు. అయితే, ప్రాజెక్ట్ సైట్‌ను రెండు మూడునెలలకోసారి మాత్రమే పరిశీలించేందుకు వెళ్లేవాడినని ఆయన చెప్పడంతో.. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఫైర్ అయ్యారు. ‘‘అంత పెద్ద బ్యారేజీని నిర్మిస్తున్నప్పుడు ఒక సీఈగా క్వాలిటీ కంట్రోల్ కోసం సైట్ వద్దకు వెళ్లాల్సిన బాధ్యత మీది కాదా?” అని మండిపడ్డారు.
ఒక సీఈగా మీ డ్యూటీని మీరు నిర్వహించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో కనీసం రెండుసార్లైనా బ్యారేజీ సైట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. మీ పనిని వేరే వారి భుజంపైకి నెట్టేందుకు ఉబలాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈగా ప్రాజెక్ట్ సైట్‌ను విజిట్ చేయకపోవడం చాలా పెద్ద తప్పు అని అన్నారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐదేండ్లపాటు ఏజెన్సీనే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) బాధ్యతలు చూడాల్సి ఉంటుందని మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు తెలిపారు. కరోనా నేపథ్యంలో బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేశారని చెప్పారు. బ్యారేజీలకు కంప్లీషన్ సర్టిఫికెట్తానే ఇచ్చానని చెప్పారు.
ఆఫీసర్లపై జస్టిస్ఘోష్ గరంగరం
ఎంక్వైరీ సందర్భంగా ఇంజినీర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పగా.. అన్ని వివరాలూ తన దగ్గర ఉన్నాయని, అందరి విషయాలూ తెలుసని మండిపడ్డారు. తాను ఇచ్చిన వివరాలతోనే కదా తనను ప్రశ్నిస్తున్నారని క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ దేవేందర్ రెడ్డి అనడంతో.. కమిషన్ చైర్మన్ మండిపడ్డారు.
తనకు అన్నీ తెలుసన్నారు. ఇంటరాక్షన్లాగా పెడితే అన్ని వివరాలు చెబుతామని క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకట కృష్ణ అనడంతో ఘోష్సీరియస్ అయ్యారు. “ఇంటరాక్షన్ ఏంటి? ఇది ఎంక్వైరీ.. విచారణ జరుగుతున్నప్పుడు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి. నాతో మీ ఇంటరాక్షన్ ఎందుకు?” అని ప్రశ్నించారు. కాగా, మహబూబ్‌నగర్ సీఈ వెంకటరమణా రెడ్డి.. తన హోదాను అఫిడవిట్లో ఒకలాగా.. విచారణలో మరోలా చెప్పడంపైనా ఘోష్మండిపడ్డారు. అఫిడవిట్లో ఇంకా ఎన్ని తప్పులు రాశారని ప్రశ్నించారు.