ఇదెక్కడి బస్సు యాక్సిడెంట్రా నాయనా.. పాపం ఈ తండ్రీకూతురు.. వీడియో చూడండి..

ఇదెక్కడి బస్సు యాక్సిడెంట్రా నాయనా.. పాపం ఈ తండ్రీకూతురు.. వీడియో చూడండి..

కనకపుర: బెంగళూరు నగర శివార్లలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని నాగరాజుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో నాగరాజు కూతురు కావ్య కూడా ఉంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కనకపుర రోడ్డులోని కళ్లళిపుర గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది.

కనకపుర నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు అదుపు తప్పి ముందు వెళుతున్న బైకులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సుతో పాటు బైకులు కూడా కాలువలో పడిపోయాయి. గమనించిన స్థానికులు గాయపడిన వాళ్లను కాపాడే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ALSO READ | జస్ట్ మిస్.. అలర్ట్గా లేకపోయి ఉంటే.. లారీ టైర్ల కింద స్కూటీ బదులు ఈమె ఉండేది..!

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు చెప్పారు. ఈ ప్రమాదంలో చనిపోయిన నాగరాజు ఎలక్ట్రానిక్స్ సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పీఎస్ఐగా పనిచేస్తున్నాడు. స్కూటీపై రోజూలానే డ్యూటీకి వెళుతున్నాడు. అతని కూతురు కావ్య తండ్రితో కలిసి స్కూటీపై వెళుతోంది. అనుకోని ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.

నాగరాజు చనిపోగా, కావ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రాణాలతో బయటపడాలని.. క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఆకాంక్షించారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.