గెలవాలనే పోరాటం.. అప్పు తీర్చాలని బ్యాంక్ వేధింపులు.. కన్నీళ్లు తెప్పిస్తున్న యువకుడి ఆత్మహత్య

గెలవాలనే పోరాటం.. అప్పు తీర్చాలని బ్యాంక్ వేధింపులు.. కన్నీళ్లు తెప్పిస్తున్న యువకుడి ఆత్మహత్య

కుర్రోడు.. కొద్దోగొప్పో చదువుకున్నాడు..  జులాయిగా ఏమీ తిరగలేదు.. కష్టపడి ఎదగాలనుకున్నాడు.. జీవితాన్ని గెలవాలనుకున్నాడు.. తనకు నచ్చిన.. వచ్చిన వ్యాపారంలో బాగా స్థిరపడాలని భావించాడు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి 11 లక్షల రూపాయల లోన్ తీసుకుని.. ఓ డీసీఎం వ్యాన్ కొనుగోలు చేశాడు. విధి మరోలా తలచింది.. జీవితంలో ఓడిపోయేలా చేసింది.. హైదరాబాద్ యువకుడు రాజశేఖర్ ఆత్మహత్య అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ సిటీ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనికేశ్వర్ నగర్ కు చెందిన రాజశేఖర్.. 2023, ఆగస్ట్ 7వ తేదీ రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం అప్పు ఇచ్చిన బ్యాంక్ వాళ్ల వేధింపులు, ఒత్తిడులు. స్వయం కృషితో ఎదగాలనుకున్న రాజశేఖర్.. ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి 11 లక్షల రూపాయల అప్పు తీసుకుని.. డీసీఎం వ్యాన్ కొనుగోలు చేసి.. అద్దెకు తిప్పుతూ జీవితం సాగిస్తున్నాడు. అయితే రెండు నెలలుగా బండి అద్దె తీసుకునే వారు లేక.. ఆర్థిక ఇబ్బందులతో ప్రతినెలా కట్టే ఈఎంఐ చెల్లించలేదు. దీంతో బ్యాంక్ వాళ్లు.. అప్పు కట్టాలని.. ఈఎంఐలు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేశారు. రెండు నెలలు ఈఎంఐ కట్టలేదని.. ఇంటికొచ్చిన బ్యాంకు సిబ్బంది.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వెంటనే ఈఎంఐతోపాటు అప్పు కూడా చెల్లించాలని నిలదీశారు.

బాడుగలు లేవని.. త్వరలోనే అంతా కట్టేస్తానని.. సమయం ఇవ్వాలని కోరాడు. అయినా బ్యాంకు వాళ్లు వినకపోగా బలవంతం చేశారు. ఇంట్లో పరువు పోయింది.. చేతిలో డబ్బులు లేవు.. సమయం ఇవ్వాల్సిన బ్యాంకు వాళ్లు తొందర పడుతున్నారు.. కొత్తగా అప్పు కూడా దక్కే పరిస్థితులు లేకపోవటంతో.. తీవ్ర మనస్థాపంతో.. మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్.

11 లక్షల రూపాయల అప్పుకు.. డీసీఎం వ్యాన్ అయితే ఉంది కదా.. అయినా రెండు నెలల ఈఎంఐ కట్టలేదని ఇంటికొచ్చి మరీ బ్యాంకు వాళ్లు పరువు తీయాలా.. నిలదీయాలా అంటున్నారు స్థానికులు, నెటిజన్లు. వేలు, లక్షల కోట్లు అప్పు ఎగ్గొడుతున్న బడా పారిశ్రామికవేత్తల దగ్గరకు ఇలాగే వెళ్లి బ్యాంక్​ వాళ్లు గొడవలు చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు. 

జీవితంలో ఎదగాలనుకున్న రాజశేఖర్ జీవితం.. విధిరాతకు తలవంచింది.. తాను ఒక రకంగా తలిస్తే.. దేవుడు మరోలా చూశాడు..