59 శాతం పెరిగిన బీఓబీ నికర లాభం

59  శాతం పెరిగిన బీఓబీ నికర లాభం

న్యూఢిల్లీ: బ్యాంక్​ ఆఫ్​ బరోడా (బీఓబీ) నికరలాభం సెప్టెంబర్​2022 క్వార్టర్లో 59 శాతం పెరిగి రూ. 3,313 కోట్లకు చేరింది. బ్యాడ్​లోన్లు తగ్గడంతో పాటు, వడ్డీ ఆదాయం పెరగడం వల్లే ఇది సాధ్యమైందని బ్యాంకు తెలిపింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో బ్యాంకు నికర లాభం రూ. 2,088 కోట్లు. తాజా క్యూ2 లో మొత్తం ఆదాయం రూ. 23,080 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్​ ఆఫ్​ బరోడా వెల్లడించింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​ క్వార్టర్లో ఈ మొత్తం ఆదాయం రూ. 20,271 కోట్లు. తాజా క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం 34.5 శాతం గ్రోత్​తో రూ. 10,714 కోట్లయినట్లు కూడా బ్యాంకు తెలిపింది.

గ్రాస్​ ఎన్​పీఏలు 5.31 శాతానికి తగ్గాయని, నెట్​ ఎన్​పీఏలు సైతం 1.16 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్​ ఆఫ్​ బరోడా తన రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది. ఫలితంగా ప్రొవిజన్లు అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​ క్వార్టర్లోని రూ. 2,754 కోట్ల నుంచి తాజా క్యూ 2 లో రూ. 1,627 కోట్లకు తగ్గిపోయినట్లు వివరించింది. సెప్టెంబర్​ క్వార్టర్లో నికర వడ్డీ మార్జిన్లు 3.33 శాతానికి పెరగ్గా, క్యాపిటల్​ యాడిక్వసీ రేషియో కొద్దిగా తగ్గి 15.25 శాతమైనట్లు బ్యాంక్ ఆఫ్​ బరోడా తెలిపింది. కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన బీఓబీ గ్రూప్​ నికర లాభం రూ. 3,400 కోట్లకు చేరినట్లు పేర్కొంది.