సీడీఓను తీసేశాం.. కాదు రాజీనామా చేశాను.. సీఈఓ, మాజీ సీడీఓల ఆరోపణలు

సీడీఓను తీసేశాం.. కాదు రాజీనామా చేశాను.. సీఈఓ, మాజీ  సీడీఓల ఆరోపణలు

న్యూఢిల్లీ :  బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘బాబ్ వరల్డ్’ వల్ల తలెత్తిన ఇబ్బందుల కారణంగా మేనేజ్‌‌‌‌మెంట్,  దాని మాజీ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ (సీడీఓ) మధ్య మాటల యుద్ధం నడిచింది.  యాప్‌‌‌‌లోని లోపాలను సరిదిద్దే వరకు, ఇబ్బందులు తొలగిపోయే వరకు కొత్త కస్టమర్లను యాప్‌‌‌‌లో చేర్చుకోకుండా బీఓబీని ఆర్​బీఐ గత నెల నిషేధించింది. బ్రాంచ్,  కార్పొరేట్ కార్యాలయ స్థాయిలలోని ఉద్యోగులపై  చర్యలు తీసుకోవడంలో భాగంగా బ్యాంక్ తన సీడీఓ అఖిల్ హండాను డిస్మిస్​ చేసినట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ),  మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) దేవదత్తా చంద్  తెలిపారు.  డిస్మిస్​ అబద్ధమని, తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని అఖిల్​ వాదిస్తున్నారు.  గత నెల 31న బ్యాంక్  స్టాక్ ఎక్స్ఛేంజ్​కు పంపిన నోటిఫికేషన్ ప్రకారం.. డిజిటల్ లెండింగ్ బిజినెస్ అఖిల్​ వెళ్లిపోవడాన్ని "ఉపాధిని నిలిపివేయడం"గా బ్యాంక్​పేర్కొంది. ‘టెర్మినేషన్​’ అనే మాట వాడలేదు.  తన రాజీనామా వ్యక్తిగత నిర్ణయమని, ఆగస్టు నుంచి మూడు నెలల నోటీసు కూడా అందజేసినట్లు అఖిల్​ శనివారం స్పష్టం చేశారు.

ఆయన రాజీనామా లేఖ కాపీని చూశామని నేషనల్ మీడియా పేర్కొంది.   బాబ్ వరల్డ్ అప్లికేషన్‌‌‌‌లో ఎటువంటి సమస్యలూ లేవని, భారతదేశంలోని టాప్ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌‌‌‌లలో ఒకటిగా ర్యాంక్ పొందిందని ఆయన వాదిస్తున్నారు. యాప్​లో తప్పుడు డేటా ఉందని, డాక్యుమెంట్లు సరిగ్గా లేవని ఆర్‌‌‌‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిందని సీఈఓ అంటున్నారు.  మొబైల్ ​యాప్​లో రిజిస్ట్రేషన్ల టార్గెట్​ను సాధించడానికి అధికారులు బ్యాంకు ఖాతాలను సంబంధం లేని మొబైల్ నంబర్‌‌‌‌లకు లింక్ చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ ఖాతాల నుంచి మొబైల్ నంబర్‌‌‌‌లను విత్‌‌‌‌డ్రా చేయాలో వద్దో సూచించాలని బ్రాంచ్‌‌‌‌లను బ్యాంక్ కోరినట్టు తెలుస్తోంది.  సంబంధం లేని నంబర్లను లింక్​ చేయడంపై విచారణ చేయాలని కూడా బ్రాంచ్​లను మేనేజ్​మెంట్​ ఆదేశించింది.