
ముంబై : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లాభం క్యూ 4 లో 168 శాతం జంప్ చేసింది. 2022–23 నాలుగో క్వార్టర్లో బ్యాంకు లాభం రూ. 4,775 కోట్లకు చేరింది. లోన్లాసెస్ కేటాయింపులు తగ్గడం వల్లే లాభం పెరిగింది. ఇక 2022–23 పూర్తి ఫైనాన్షియల్ ఇయర్‌కి బీఓబీ లాభం రెట్టింపయి రూ. 14,110 కోట్లకు చేరింది. మార్చి 2023 క్వార్టర్లో బ్యాంకు నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కం 33.8 శాతం ఎగసి రూ. 11,525 కోట్లయింది. బ్యాంకు ఇచ్చిన అప్పులు ఈ క్వార్టర్లో 19 శాతం గ్రోత్ రికార్డు చేశాయి. నెట్ఇంట్రస్ట్ మార్జిన్ 3.53 శాతానికి పెరగడం తనకే ఆశ్చర్యం కలిగించిందని చెబుతూ, ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనూ ఈ లెవెల్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తామని బీఓబీ సీఈఓ సంజీవ్ చద్దా వెల్లడించారు.
ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో 13 నుంచి 14 శాతం లోన్ గ్రోత్ సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో 11 నుంచి 13 శాతం కార్పొరేట్ లోన్లే ఉంటాయని ఆయన చెప్పారు. చివరి క్వార్టర్లో బ్యాడ్ లోన్ ప్రొవిజన్లు 94 శాతం తగ్గి రూ. 320 కోట్లకే పరిమితమయ్యాయని చద్దా పేర్కొన్నారు. బ్యాంకు గ్రాస్ ఎన్పీఏలు మార్చి 2023 నాటికి 3.79 శాతానికి తగ్గాయని, వాలంటరీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు తమ బ్యాంకు రూ. 1,300 కోట్లు అప్పుగా ఇచ్చిందని చద్దా వెల్లడించారు. ఈ లోన్‌లో రూ. 500 కోట్లకు తాజా క్వార్టర్లో ప్రొవిజన్ చేసినట్లు తెలిపారు.బ్యాంకు గిఫ్ట్‌సిటీ బ్రాంచ్ దూసుకెళ్తోందన్నారు. ఈ బ్రాంచ్ బిజినెస్ 5 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో క్రెడిట్ కార్డుల బిజినెస్, నైనిటాల్ బ్యాంకులలో వాటా అమ్మకం ఒక కొలిక్కి వస్తుందని కూడా చెప్పారు.