లోన్​ రికవరీకి వెళ్లి.. బియ్యం, వడ్ల సంచుల జప్తు

లోన్​ రికవరీకి వెళ్లి.. బియ్యం, వడ్ల సంచుల జప్తు
  • రైతులు అప్పు​కట్టలేదని.. ఇంట్ల సామాను గుంజుకపోయిన్రు
  • లోన్​ రికవరీ కోసం వెళ్లి.. ఇంట్లో ఉన్న బియ్యం, వడ్ల సంచుల జప్తు
  • ఇంటి ముందు ఉన్న బైక్​నూ వదలని సిబ్బంది
  • చైర్మన్​ ఫోన్​తో సామాను వెనక్కి ఇచ్చేసి.. పండుగ తర్వాత కట్టాలని హెచ్చరిక
  • ఖమ్మం జిల్లాలో డీసీసీబీ ఆఫీసర్ల ఓవరాక్షన్​

ఖమ్మం / పెనుబల్లి, వెలుగు: అప్పు కట్టడం లేదని ఖమ్మం జిల్లా డీసీసీబీ ఆఫీసర్లు రైతుల ఇండ్ల తలుపులు ఊడబీకారు. పెనుబల్లి మండలం గంగదేవిపాడులో శుక్రవారం లోన్​ రికవరీ కోసం వెళ్లిన సిబ్బంది.. బ్యాంకుకు అప్పు ఉన్న రైతుల ఇండ్లకు వెళ్లి.. వడ్లు, బియ్యం, టూవీలర్​ఇలా దేన్నీ వదలకుండా గుంజుకొచ్చారు. దీనిపై దుమారం రేగడంతో డీసీసీబీ చైర్మన్ ఆఫీసర్లకు ఫోన్​ చేశారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆఫీసర్లు.. వాహనంలో వేసుకున్న సామాను రిటర్న్​ ఇచ్చేసి.. సంక్రాంతి తర్వాత అప్పు మొత్తం కట్టాలని రైతులను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అప్పుగా తీసుకున్నది రూ.10 వేలు
2017, 18 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాలో డీసీసీబీ అధికారులు  జాయింట్​లయబిలిటీ గ్రూప్(జేఎల్జీ)లకు లోన్లు ఇచ్చారు. 5 నుంచి 10 మంది రైతులు గ్రూపుగా ఏర్పడగా.. వారికి తలా రూ.10 వేల చొప్పున అప్పు ఇచ్చారు. వచ్చిన మొత్తాన్ని పంట పెట్టుబడికి, ఇతర అవసరాలకు వాడుకున్న రైతుల్లో కొందరు వడ్డీతోపాటు అసలు తిరిగి చెల్లించగా.. మరికొందరు బకాయి పడ్డారు. సబ్సిడీ వస్తుందనే ఆశతో కొందరు, మాఫీ అవుతుందని ఇంకొందరు లోన్లు కట్టలేదు. ఇలా పెనుబల్లి మండలంలో దాదాపు 50 జేఎల్జీ గ్రూపులకు లోన్లు ఇయ్యగా.. 23 గ్రూపుల సభ్యులు పూర్తిగా చెల్లించారు. ఇంకా 27 గ్రూపుల వారు కొంచెం కొంచెంగా కడుతూ వస్తున్నారు. కొంతకాలంగా బ్యాంకు సిబ్బంది లోన్ల రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. రెండు జీపుల్లో దాదాపు 15 మంది డీసీసీబీ ఆఫీసర్లు, సిబ్బంది శుక్రవారం పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చేరుకున్నారు. అప్పు ఉన్న రైతుల ఇంటింటికీ తిరిగారు. దాదాపు నాలుగు ఇండ్లలో తలుపులు పీకి.. అప్పు మొత్తం కట్టాలని హెచ్చరించారు. మరో 10 ఇండ్లలో వడ్లు, బియ్యం ఏది దొరికితే అది జప్తు చేసి.. రికవరీ వాహనంలో వేశారు. ఓ రైతు ఇంట్లో ఉన్న టూ వీలర్​ను జప్తు చేసి వాహనంలోకి ఎక్కించారు. అయితే మగవాళ్లు ఎవరూ ఇండ్లలో లేని సమయంలో బ్యాంకు సిబ్బంది ఇంటిమీదకు వచ్చి దౌర్జన్యం చేయడమేంటని పలువురు మహిళలు ప్రశ్నించారు. వ్యవసాయం బాగలేక అప్పు కట్టలేకపోయామని, గడువు ఇస్తే చెల్లిస్తామని చెబుతున్నా.. ఇంట్లో ఉన్న వస్తువులను జప్తు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 వేలు, 10 వేల కోసం ఇంటి తలుపులు పీకి పరువు తీశారంటూ బ్యాంక్ అధికారులు, సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 

చైర్మన్​ ఫోన్​తో వెనక్కి..
కొందరు స్థానికులు అధికారుల లోన్​రికవరీ ఇష్యూను డీసీసీబీ చైర్మన్​కూరాకుల నాగభూషయ్యకుకు తెలపడంతో.. ఆయన వారికి ఫోన్​చేశారు. సామాను జప్తు చేయకూడదని ఆదేశించడంతో ఆఫీసర్లు వెనక్కి తగ్గారు. అప్పటికే.. రికవరీ వాహనంలోకి ఎక్కించిన వడ్లు, బియ్యం బస్తాలు, టూవీలర్​ను రైతులకు తిరిగి ఇచ్చేశారు. పండుగ వరకు టైమ్​ ఇస్తున్నామని, తర్వాత వడ్డీ, అసలు మొత్తం చెల్లించాలని, లేదంటే జప్తు చేస్తామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లారు.

చనిపోయినా వదలట్లేదు..
రెండేండ్ల కిందట మా తమ్ముడు డీసీసీబీలో గ్రూప్ ద్వారా రూ.10 వేలు లోన్ తీసుకున్నడు. అప్పుడు రూ.8 వేలు ఇచ్చి రూ.10 వేలు ఇచ్చినట్లు రాసుకున్నరు. ఏడాది క్రితం రూ.5 వేలు కట్టినం. తర్వాత మా తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు బ్యాంక్ అధికారులు వచ్చి చనిపోయిన మా తమ్ముడు లోన్ పైసలు కట్టాలని పట్టుపట్టారు. రెండు రోజులు టైం అడిగినా ఇయ్యలేదు. జప్తు కింద ఇంటి ముంగట ఉన్న బండి తీస్కపోయిన్రు. 
- సానిక చెన్నారావు, గంగదేవిపాడు


5 వేల లోన్‌‌కు రూ.18 వేలు కట్టించిన్రు..
నేను జేఎల్జీ గ్రూప్‌‌లో రూ.10 వేలు అప్పు తీసుకున్న. మధ్యలో రూ.5 వేలు కట్టిన. ఇప్పుడు బ్యాంక్ వాళ్లు వచ్చి వడ్డీతో కలిపి రూ.18 వేలు అయ్యాయని, కట్టకపోతే ఇంటికి ఉన్న తలుపులు, ఇంట్లో ఉన్న సామాను జప్తు చేస్తామని బెదిరించారు. పరువు పోతుందని భయపడి అప్పు చేసి 5 వేలకు రూ.18 వేలు కట్టిన. 
- వల్లెపు రాధాకృష్ణ, గంగదేవిపాడు


ఇంట్లో ఎవరూ లేరని చెప్పినా..
ఒకటే సారి పది పదిహేను మంది బ్యాంకోళ్లమంటూ.. ఇంటి మీదకొచ్చిన్రు. ఆరోగ్యం బాగలేక నా భర్త ఖమ్మం ఆసుపత్రిలో ఉన్నాడు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్న. నా దగ్గర పైసలు లేవు అని చెప్పినా.. వినలేదు. ఇంట్లోకి వచ్చి సంచిల నుంచి వడ్లు తీసిన్రు. చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో రెండురోజుల టైమ్ ​ఇచ్చి పోయిన్రు.
- అలివేలు, గంగదేవిపాడు

చట్ట ప్రకారమే జప్తు చేయడానికి వెళ్లినం..
లోన్లు తీసుకున్న వారికి మూడుసార్లు నోటీసులు ఇచ్చాం. ఊర్లల్లో మైకులతో అనౌన్స్ చేయించాం. బ్యాంక్ సిబ్బంది స్వయంగా వెళ్లి వాళ్లను కలిసి లోన్ తిరిగి కట్టాలని చెప్పాం. వాటికి స్పందించకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సహకార చట్టం ప్రకారమే జప్తు చేయడానికి వెళ్లాం. 
- అనిల్ కుమార్, డీసీసీబీ మేనేజర్,​ పెనుబల్లి