- రైతుల అకౌంట్లపై పెట్టిన ఫ్రీజింగ్ ను ఎత్తేయని బ్యాంకులు
- మొదట వడ్ల పైసలు, ఆ తర్వాత రైతు బంధు ఆపిన్రు
- మందులకు డబ్బులు లేవని వృద్ధులు వేడుకుంటున్నా కనికరిస్తలే
- అప్పు కట్టే వరకు ఇయ్యబోమంటున్న బ్యాంకర్లు
నాగర్‌కర్నూల్/సంగారెడ్డి, వెలుగు: పంట లోన్లు కట్టడం లేదనే కారణంతో గత వానాకాలం వడ్ల పైసలు వచ్చినప్పుడు రైతుల అకౌంట్లపై ఫ్రీజింగ్పెట్టిన చాలా బ్యాంకులు.. ఇప్పటి వరకు దాన్ని ఎత్తేయలేదు. దీంతో వడ్ల పైసలు, రైతు బంధు మాత్రమే కాదు.. ఆఖరికి వృద్ధులు, దివ్యాంగులకు నెలనెలా బ్యాంకుల ద్వారా ఇచ్చే ఆసరా పింఛన్లు కూడా ఆగిపోతున్నాయి. ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పినందునే తాము పంట రుణాలు చెల్లించలేదని, దాని కోసం తమ పింఛన్లుఆపడం న్యాయం కాదని బాధితులు వేడుకుంటున్నా బ్యాంకర్లు వినిపించుకోవడం లేదు. పింఛన్తమకు మందుకో, మాకుకో అవసరముంటుందని.. దయచేసి ఫ్రీజింగ్ ఎత్తేయాలని వేడుకుంటున్నా కనికరిస్తలేరని బాధితులు వాపోతున్నారు.
అకౌంట్ తో లింకున్నోళ్లకే సమస్య..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 38 లక్షల మందికి ఆసరా పింఛన్లు వస్తున్నాయి. వీరిలో 22 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా, మిగిలిన 16 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లో చాలామందికి ఒకటే అకౌంట్ఉండడంతో అందులోనే ఆసరా పింఛన్లు పడుతున్నాయి. వాటిపై ఫ్రీజింగ్పెట్టడం వల్ల రైతుల్లోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ తీసుకోలేకపోతున్నారు.
ఇదేమని అడిగితే వడ్డీ కట్టి లోన్లు రెన్యూవల్చేసుకోవాలని చెబుతున్నారు. సర్కారు కడ్తుంది కదా? అంటే కట్టినప్పుడు వెనక్కి ఇస్తామని అంటున్నారు. దీంతో కొందరు రైతులు ఆసరా పైసలను వడ్డీ కింద జమేసుకొని నిరాశతో వెనుదిరుగుతున్నారు.
అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి...
ఒక్క నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్గ్రామంలో ఏకంగా 25 మంది వృద్ధులు పింఛన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మదీరా గ్రామానికి చెందిన సుమారు 10 మంది వృద్ధులు ఇలాగే పింఛన్లు రాక తిప్పలు పడుతున్నారు. ఇదేంటని బ్యాంకర్లను నిలదీస్తే హామీ పత్రం రాయించుకొని పింఛన్లు ఇచ్చారని ఇద్దరు వృద్ధులు వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. తమ పేరు మీద భూమి మాత్రమే ఉందని, వాటిపై తమ కొడుకులు క్రాప్లోన్లు తీసుకుంటే.. తమకు పింఛన్ఆపడం ఎంతవరకు కరెక్ట్‌అని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకర్ల తీరు వల్ల కనీస అవసరాలు తీర్చుకోలేక, నెలనెలా మందులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నామని, తమ అకౌంట్లపై పెట్టిన ఫ్రీజింగ్ఎత్తేసి తమకు పింఛన్లు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.
సర్కార్ మాఫీ చేస్తలె.. బ్యాంకర్లు వింటలె
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష లోపు పంట రుణాలను మూడేండ్లలో మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌హామీ ఇచ్చారు. 2018 డిసెంబర్ 11 వరకు ఉన్న క్రాప్ లోన్లను అసలు, వడ్డీతో కలిపి రూ.లక్ష వరకు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా40.66 లక్షల రైతులకు సంబంధించి రూ.25,936 కోట్ల పంట రుణాలు ఉన్నట్లు గుర్తించారు. గడిచిన మూడేండ్లలో కేవలం 4 లక్షల మంది రైతులకు చెందిన రూ.732.24 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.25,203 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. ఈ లోన్లను ఏడాదికోసారి వడ్డీ కట్టి రెన్యూవల్చేసుకోవాల్సి ఉన్నప్పటికీ, సర్కారే మాఫీ చేస్తుందనే నమ్మకంతో చాలా మంది రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతుల అకౌంట్లలో వడ్ల పైసలు పడ్డప్పుడల్లా బ్యాంకర్లు ఫ్రీజింగ్పెడుతున్నారు. గత వానాకాలం డబ్బులు అకౌంట్లలో పడగానే రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకులు పెట్టిన ఫ్రీజింగ్‌ను ఇప్పటికీ ఎత్తివేయలేదు.
డిఫాల్ట్ అయితే ఆటోమేటిక్‌గా కట్ అవుతయి..
బ్యాంకు లోన్క్లియర్ అయ్యే వరకు ఆ అకౌంట్ హోల్డ్‌లో ఉంటుంది. బ్యాంకర్లు చేసేదేమీ ఉండదు. క్రాప్‌లోన్స్, పర్సనల్లోన్స్ఏమైనా ఉంటే అకౌంట్లో ఎక్కడి నుంచి డబ్బు పడ్డా తీసుకునే చాన్స్ఉండదు. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆసరా పింఛన్లను మేము ఉద్దేశపూర్వకంగా ఆపడం లేదు. లోన్ క్లియర్ అయితే పింఛన్ డబ్బు రిలీజ్ అవుతుంది.
- సందీప్, యూనియన్ బ్యాంక్ మేనేజర్, పాలెం
5 వేల వడ్డీ కట్టినా పింఛన్ ఇయ్యలే..
నాకు పాలెం బ్యాంకులో క్రాప్లోన్ఉన్నది. ఏడాది నుంచి పింఛన్పట్టుకుంటున్నరు. రైతు బంధు ఆపుకున్నరు. ఇదేందని అడిగితే వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకోవాలన్నరు. బయట నాలుగు రూపాల మిత్తికి 5 వేలు తెచ్చి వడ్డీ కట్టిన. బ్యాంక్ సార్ కాళ్లవేళ్ల పడ్డా పాస్‌బుక్కులు ఇయ్యలే. ఇప్పుడు పింఛన్సుత ఆపుతున్నరు. మందులకు శానా తక్లీఫ్అయితంది. ఎట్లయినా నా పింఛన్ ఇప్పించున్రి.
- కుర్మమ్మ, ఖానాపూర్, బిజినేపల్లి మండలం,
నాగర్‌కర్నూల్ జిల్లా
4 నెలలుగా పింఛన్ ఇస్తలేరు..
నా మూడెకరాల భూమిని హత్నూర ఎస్ బీఐ బ్యాంకులో కుదవపెట్టి రూ.80 వేల లోన్ తీసుకున్న. సర్కారు మాఫీ చేస్తదని చెప్తే కట్టలే. ఇప్పడది మిత్తితో కలిపి రూ.1.33 లక్షలు అయ్యిందట. నన్ను ఎగవేతదారుని కింద పెట్టి రూ.33 వేలు వడ్డీ కట్టుమని బ్యాంకోళ్లు జబర్దస్తీ చేస్తున్నరు. నాలుగు నెలల నుంచి పింఛన్‌కూడా ఇస్తలేరు. లోన్ కడ్తెనే పింఛన్ఇస్తనని మేనేజర్ చెప్తుండు. క్రాప్‌లోన్‌కు, పెన్షన్ కు ఏమి సంబంధమో సమజైతలేదు.
- చెట్టుకింది నర్సింలు, పన్యాల, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లా
