బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా.. తెలంగాణ  మాజీ పోలీస్​ అధికారి కృష్ణ ప్రసాద్

బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా.. తెలంగాణ  మాజీ పోలీస్​ అధికారి కృష్ణ ప్రసాద్

వరంగల్‌ టిక్కెట్ కోసం ప్రయత్నించిన మాజీ పోలీస్​ అధికారి కృష్ణ ప్రసాద్ కొద్ది రోజులుగాతీవ్ర ప్రయత్నాలు చేశారు. వరంగల్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఏపీలో బాపట్ల టిక్కెట్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఆయన అత్త శమంతక మణి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ పరిచయాలతోనే ఆయనకు బాపట్ల టిక్కెట్ ను టీడీపీ కేటాయించింది. 

టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో అనూహ్యంగా తెలంగాణ క్యాడర్‌ మాజీ డీజీ స్థాయి అధికారి తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ను ఖరారు చేశారు. కృష్ణ ప్రసాద్ వాస్తవానికి కొద్ది రోజుల క్రితం వరకు బీజేపీ తరపున వరంగల్ టిక్కెట్ ఆశించారు. కొంత కాలంగా వరంగల్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెన్నేటి కృష్ణప్రసాద్ వరంగల్ టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ప్రధాని మోదీ పర్యటనల్లో కూడా ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీలో ఆయన అభ్యర్ధిత్వం ఖాయమని భావించిన వేళ అనూహ్యంగా ఏపీలో టీడీపీ టిక్కెట్ దక్కింది. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి తరపున ఆయన పోటీ చేయనున్నారు.

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా, వరంగల్‌, విశాఖ రేంజ్‌లలో డిఐజిగా పనిచేశారు. నెల్లూరు, విశాఖపట్నం, మెదక్‌, గుంటూరు ఎస్పీలుగా గతంలో పనిచేశారు. ఉమ్మడి గుంటూరులో భాగమైన బాపట్లలో లోక్‌సభ్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో ఎస్పీగా పనిచేసిన అనుభవం పనికొస్తుందనే ఉద్దేశంతో కృష్ణ ప్రసాద్ అభ్యర్ధిత్వానికి టీడీపీ మొగ్గు చూపింది.

బాపట్ల ఎంపీ అభ్యర్థి స్థానికేతర్లకు కేటాయించడంపై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు.  పార్టీ అధిష్ఠానానికి తీవ్రమైన ఒత్తిడి టిడిపికి వస్తున్నట్లుగా సమాచారం.  ఈ నేపథ్యంలో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు బాహాటంగానే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.  అదేవిధంగా బాపట్ల ఎంపీ అభ్యర్థులు ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని ఎందుకంటే బాపట్ల పార్లమెంటులో మాలలు ఎక్కువ శాతం ఉన్నారని ఖచ్చితంగా మాలలకు సీటు ఇవ్వాలనే డిమాండ్ కూడా  చేస్తున్నారు. 


1960లో హైదరాబాద్‌ జన్మించిన తెన్నేటి కృష్ణప్రసాద్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేశారు. తండ్రి సుబ్బయ్య ఐటీఐ ప్రిన్సిపల్‌గా తల్లి విజయలక్ష్మీ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. 1986 బ్యాచ్‌ ఐపీఎస్ అధికారైన కృష్ణ ప్రసాద్ పోలీస్ శాఖలో 34ఏళ్లు పనిచేశారు. ఎన్‌ఐటి వరంగల్‌ నుంచి బిటెక్‌ పూర్తి చేసిన కృష్ణప్రసాద్ ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి ఎంబిఏ పూర్తి చేశారు. మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలో కలకపడంలో కీలక పాత్ర పోషించారు. సంజీవని ఆపరేషన్‌తో మావోయిస్టులను ప్రజా జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నించారు. సరెండర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా మావోయిస్టులను ప్రజాజీవితంలో కలిసేలా ప్రోత్సహించే వారు. 450మందికి పైగా మావోయిస్టుల్ని తిరిగి జనజీవితంలోకి తీసుకొచ్చిన రికార్డు ఉంది.డిసెంబర్‌ 2009లో ఐజీ పోలీస్‌ సర్వీసెస్ హోదాలో ఉమ్మడి ఏపీలో 1865 పోలీస్ స్టేషన్లను కంప్యూటర్లతో అనుసంధానించారు. నాలుగు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. రెండు రేంజ్లలో డిఐజిగా విధులు నిర్వర్తించారు.