
ఎల్కతుర్తి (కమలాపూర్), వెలుగు: దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ ఆర్వోబీ పనుల్లో గడ్డర్లను ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో ఆర్వోబీపై ఆదివారం ఉదయం చెన్నై నుంచి తెప్పించిన భారీ క్రేన్ సహాయంతో, మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపేసి పనులు పూర్తి చేశారు. మిగతా పనులు నెలరోజుల్లో పూర్తి చేసి, ప్రజల రవాణా సౌకర్యం కల్పిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి హనుమకొండ జిల్లా పరకాల వరకు 30.5 కిలోమీటర్ల ఫోర్ లైన్ నిర్మాణానికి 2016 సెప్టెంబర్‌లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.
రెండు జిల్లాలకు వారధిగా ఉన్న ఈ రోడ్డుకు రూ. 100 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయినా.. తొమ్మిదేళ్లుగా ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయలేదు. ఫలితంగా రైల్వే గేటు పడితే వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల రైల్వే శాఖ అధికారులను పిలిపించుకుని ఉప్పల్ ఆర్వోబీ పనుల గురించి చర్చించారు.
చెన్నై నుంచి క్రేన్ తెప్పించి గడ్డర్లు బిగించి ..
కాంట్రాక్టర్లు మారినా, సీబీఐ విచారణ జరిగినా దాదాపు దశాబ్ద కాలంగా ఆ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నెల రోజుల్లో పనులను పూర్తి చేయకపోతే వచ్చే నెలలో తానే దగ్గరుండి ఆర్వోబీని కూల్చివేయిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన రైల్వే శాఖ అధికారులు.. ఉప్పల్ ఆర్వోబీ పనుల్లో గడ్డర్ల బిగింపు చేపట్టారు.
గడ్డర్లకు బిగింపునకు అవసరమైన క్రేన్ రాష్ట్రంలో అందుబాటులో లేదు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రైల్వే జీఎం, ఏజీఎంతో మాట్లాడి, చెన్నై నుంచి క్రేన్ తెప్పించి, జమ్మికుంట ఉప్పల్ వైపు రైళ్ల రాకపోకలను మూడున్నర గంటలపాటు నిలిపేసి, ఆ క్రేన్ తోపాటు అందుబాటులో ఉన్న మరో క్రేన్ సాయంతో గడ్డర్ల బిగింపు పనులు పూర్తి చేశారు.