తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్

తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్

మద్యం వినియోగదారులకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతులిచ్చింది. ఇందుకోసం కొత్త ఎక్సైజ్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్‌డౌన్ కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బులను ఆదుకునేందుకు ఎక్సైజ్ పాలసీలో సంస్కరణలు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇలా చేయడం ద్వారా లిక్కర్ మాఫియాను కూడా అరికట్టవచ్చని పేర్కొంది. కొత్త పాలసీలో లిక్కర్ హోం డెలివరీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయసును 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఢిల్లీకి లిక్కర్ ఒక ముఖ్యమైన ఆదాయ వనరు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్త ఎక్సైజ్ పాలసీ 2021-22ను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.