30 ఏండ్లలో రూ. 15 వేల కోట్ల రెవెన్యూ అనడం కరెక్ట్ కాదు

30 ఏండ్లలో రూ. 15 వేల కోట్ల రెవెన్యూ అనడం కరెక్ట్ కాదు

హైదరాబాద్ , వెలుగు: ఔటర్​ రింగ్​ రోడ్డు (ఓఆర్​ఆర్​) టోల్​ టెండర్​ బేస్​ ప్రైస్​ను బయటపెట్టలేమని, ప్రభుత్వం నిర్ణయించిన బేస్​ ప్రైస్​ కంటే ఎక్కువనే ఐఆర్​బీ ఇన్​ఫ్రా కోట్​ చేసిందని మున్సిపల్ స్పెషల్ సీఎస్, హెచ్ ఎం డీఏ కమిషనర్ అరవింద్ కుమార్  తెలిపారు.  30 ఏండ్లలో ఓఆర్​ఆర్ టోల్ రెవెన్యూ రూ. 15 వేల కోట్లు వస్తుందనేది కరెక్ట్ కాదని అన్నారు. ‘‘టోల్ టెండర్ పొందిన ఐఆర్​బీ ఇన్​ఫ్రా ఒకేసారి డబ్బు కడుతుంది. ఆ అమౌంట్​పై 30 ఏండ్ల వడ్డీ లెక్కకడితే భారీ మొత్తం​ అవుతుంది. రూల్స్ లో భాగంగా బేస్ ప్రైస్ ను బయట పెట్టలేం. ఎన్ హెచ్ ఏ ఐలో కూడా బేస్ ప్రైస్ చెప్పటం లేదు. 30 ఏండ్లపాటు ఓఆర్ ఆర్ టోల్ టెండర్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్​లోనే నిర్ణయించారు” అని ఆయన తెలిపారు. ఓఆర్​ఆర్​పై గత ఏడాది రూ.542 కోట్ల టోల్ వసూలైందని, 2024‌–‌ 25 ఏడాదికి రూ. 689 కోట్లు వసూలవుతుందనే అంచనా ఉందని పేర్కొన్నారు.

రోజూ లక్షా 65 వేల వెహికల్స్ ఓఆర్ ఆర్ పై ప్రయాణిస్తుండగా, రూ.1.48 కోట్ల రెవెన్యూ యావరేజ్ గా వస్తుందని చెప్పారు. ఎన్ హెచ్​ఏఐ  రూల్స్ ప్రకారమే ఓఆర్​ఆర్​ టోల్ టెండర్ పారదర్శకంగా చేశామని, ఒక కంపెనీకి అనుకూలంగా పనిచేయలేదని ఆయన అన్నారు. ‘‘ఏటా టోల్ చార్జీల పెంపుపై  ఐఆర్​బీ ఇన్ ఫ్రా  అందించిన ప్రపోజల్స్​ను హెచ్​ఎండీఏ ఆమోదించిన తరువాతే అమలవుతాయి. రూల్స్​కు తగ్గట్టుగా టెండర్ ప్రాసెస్ పూర్తయింది. ఫైనాన్సియల్ క్లోజర్ మరో నెలలో పూర్తవుతుంది. తరువాత టెండర్ ప్రాసెస్ వివరాలు అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచుతం. ఓఆర్​ఆర్​ పరిధిలో ఉన్న భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటయ్​. సైకిల్ ట్రాక్స్, ట్రామా కేర్ సెంటర్స్, గ్రీనరీ నిర్వహణ హెచ్​ఎండీఏనే నిర్వహిస్తుంది”  అని చెప్పారు. ఓఆర్​ఆర్ టోల్ టెండర్​విషయంలో వస్తున్న కథనాలపై బుధవారం మసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో అరవింద్​కుమార్​ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్​కు కెమెరామెన్లను, ఫొటోగ్రాఫర్లను అనుమతించకుండా కేవలం రిపోర్టర్లను పిలిచారు. సమాచార శాఖ కెమెరా ఉంచినా తీసేయాలని అరవింద్ సైగ చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేస్తూ.. తాను చెప్పాల్సింది చెప్పారు. ఓఆర్ ఆర్ టోల్ టెండర్ దక్కించుకున్న ఐఆర్ బీ ఇన్ ఫ్రా కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉందని , దీనిపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని ఇటీవల కాంగ్రెస్ నేత బక్క జడ్సన్  అనడంపై ప్రశ్నించగా.. అరవింద్​ స్పందించలేదు. టెండర్ వివరాలను ఆర్టీఐ ద్వారా పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్  అడగడంపై ప్రశ్నించగా.. ఇటీవల తమ ఆఫీస్ కు వచ్చి అప్లికేషన్ ఇచ్చి వెళ్లారని ఆయన తెలిపారు. పొలిటికల్ గా వస్తున్న ఆరోపణలపై ఆన్సర్ చెప్పలేనని, కేవలం టెండర్ ప్రాసెస్ వివరాలు చెప్పగలనని అన్నారు. 

ట్రాఫిక్​, టోల్​ వసూళ్లపై సర్కారు రివ్యూ చేస్తుంది

ట్రాఫిక్, టోల్ వసూళ్లపై ప్రతి ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వం రివ్యూ చేస్తుందని, అంచనా వేసిన దాని కంటే ఎక్కువ టోల్ వసూలైతే టెండర్ టైమ్ 30 ఏండ్ల నుంచి ఇరవై అయిదు, ఇరవై ఏండ్లకు తగ్గిస్తామని, ఇవన్నీ టెండర్ రూల్స్​లో స్పష్టం చేశామని అరవింద్​ కుమార్​ తెలిపారు. ‘‘ఐఆర్ బీ ఇన్ ఫ్రా బిడ్ ఇంకా పెంచుతారా?’’ అని ప్రశ్నించగా.. రూల్స్ ప్రకారం రూ.7,380 కోట్లకు పెంచామని తెలిపారు. మూడు సార్లు టెండర్ గడువు పొడిగించామని చెప్పారు. అదానీ, జీఎంఆర్, ఈగల్ ఇన్ ఫ్రా, దినేశ్​ చంద్ర, గవార్ కంపెనీలు టెండర్ దాఖలు చేశాయని, టెండర్ గడువును మరో 45 రోజులు పొడిగించాలని అదానీ కంపెనీ కోరిందని, కుదరదని చెప్పామని ఆయన అన్నారు.