
టోవినో థామస్, కుంచకొ బొబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి లీడ్ రోల్స్‌లో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘2018’. కేరళలో వచ్చిన వరదల ఆధారంగా జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళ చిత్రం పదిరోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరి ఆశ్చర్య పరిచింది. ఈ సినిమాను తెలుగులో బన్నీ వాస్ విడుదల చేస్తున్నారు. ఈనెల 26న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ ఇందులో కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకముంది’ అన్నారు. కంటెంట్‌ను నమ్మి మలయాళ హీరోలంతా ఇందులో నటించారని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ చెప్పాడు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’ అని నిర్మాత బన్నీ వాస్ అన్నారు.