బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల 24గంటల నిరసన దీక్ష

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల 24గంటల నిరసన దీక్ష

బాసర III ఐటీ విద్యార్థులు 24 గంటల నిరసన దీక్షకు దిగారు. సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాత్రంతా దీక్షలో కూర్చుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఆరో రోజు వర్షంలోనూ తడుస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. శనివారం (జూన్ 18న) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేస్తున్నారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు బాసరకు వచ్చే అన్ని రూట్లలో భారీగా భద్రత పెంచారు.

విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం బాసర III ఐటీ నుంచి విద్యార్థులను ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తోంది. క్యాంపస్ లోని PUC-1, PUC-2 విద్యార్థులు ఔట్ పాస్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పేరెంట్స్ లేకుండా ఔట్ పాస్ లు ఎలా ఇస్తారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు, గార్డియన్ సమక్షంలోనే ఔట్ పాస్ లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామన్నారు. తమ నిరసనలకు చెక్ పెట్టేందుకు సర్కార్ ఔట్ పాస్ లు జారీ చేస్తోందని విద్యార్థులు మండిపడుతున్నారు.  మరోవైపు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ బాసర IIIT ముట్టడికి ABVP ప్రయత్నించింది.