525 వెరైటీల్లో బతుకమ్మ చీరలు వచ్చేశాయ్​!..

525 వెరైటీల్లో బతుకమ్మ చీరలు వచ్చేశాయ్​!..

రాజన్న సిరిసిల్ల, వెలుగు : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు రాష్ట్రమంతా చేరుకున్నాయి. బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో బతుకమ్మ చీరల పంపిణీని సిరిసిల్ల అధికారులు లాంఛనంగా ప్రారంభించగా,  పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు  చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్​లో రంగురంగుల చీరలతో డెకరేట్​ చేసిన వేదిక పై నుంచి చేనేత జౌళిశాఖ ఏడీ సాగర్, స్టేట్​పవర్ లూమ్, టెక్స్ టైల్స్ ​కార్పొరేషన్ ​చైర్మన్ ​గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మహిళలకు చీరలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజుల్లో రాష్ట్రమంతా పంపిణీ చేస్తామని చేనేత జౌళిశాఖ ఏడీ సాగర్ తెలిపారు. చీరల పంపిణీ కోసం బీఆర్ఎస్ ​ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు.. పంచాయతీలు, కమ్యూనిటీ హాళ్లు, వార్డుల్లో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్​కార్డు ఆధారంగా 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ఒక చీర చొప్పున అందజేయనున్నారు. కాగా, ఈసారి సిరిసిల్ల కార్మికులు.. 25 రంగులు, 25 డిజైన్లతో మొత్తం 525 వెరైటీల్లో చీరలను రూపొందించారు. ఎన్నికల ఏడాది కావడంతో గతంతో పోలిస్తే చీరల రంగులు, క్వాలిటీ బాగున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. 

5.56 కోట్ల మీటర్ల క్లాత్​... రూ.348 కోట్లు  

ఫిబ్రవరి15న చేనేత జౌళిశాఖ సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల కోసం 5.56 కోట్ల మీటర్ల క్లాత్​కావాలని ఆర్డర్​ఇచ్చింది. 25 కలర్లు, 25 
డిజైన్లలో ఇవ్వాలని చెప్పి సెప్టెంబర్ 15 వరకు గడువు విధించింది. దీంతో 139 మ్యాక్స్ సంఘాలు,126 ఎస్ఎస్ఐ యూనిట్లు బతుకమ్మ చీరల తయారీలో భాగస్వామ్యమయ్యాయి. సుమారు 5 వేల మంది నేత కార్మికులు ఆరు నెలలు శ్రమించి కోటి చీరలు రెడీ చేశారు. బడ్జెట్ అంచనా రూ.348 కోట్లు కాగా, కార్మికులకు రూ.90 కోట్లు, ప్రాసెసింగ్ కు రూ.60 కోట్లు, మిగతా బతుకమ్మ చీరల క్లాత్​ను ఉత్పత్తి చేసిన వారికి రూ.197 కోట్ల వరకు అవుతుందని అధికారులు అంచనా వేశారు. సిరిసిల్లలో 5.16 కోట్ల మీటర్ల క్లాత్​ఉత్పత్తి అవ్వగా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ జిల్లాల నుంచి 40 లక్షల మీటర్ల బట్ట ఉత్పత్తయ్యింది.