మంచిగలేవని బతుకమ్మ చీరలను తగలబెట్టిన మహిళలు

మంచిగలేవని బతుకమ్మ చీరలను తగలబెట్టిన మహిళలు

ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సేవ్యా నాయక్ తండాలో బతుకమ్మ చీరలను మహిళలు తగులబెట్టారు. బతుకమ్మ చీరల పేరుతో మూడేళ్ల నుంచి క్వాలిటీ లేని చీరలను పంపిణీ చేస్తున్నారని, అందుకే ఇలా కాల్చేసి నిరసన తెలిపామని చెప్పారు. ప్రభుత్వం కేవలం ప్రచారం కోసమే చీరలను పంపిణీ చేస్తోందని, క్వాలిటీ లేనివి తమకు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. చీరలు ఇవ్వమని కేసీఆర్ ను అడిగామా? అని ప్రశ్నించారు. సేవ్యా నాయక్ తండాలో డ్వాక్రా గ్రూపు లీడర్ల ఆధ్వర్యంలో సుమారు 200 బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అయితే చీరలు తీసుకునేందుకు వచ్చిన మహిళలు.. వాటి క్వాలిటీని చూసి అసంతృప్తి చెందారు. ‘‘ఈసారి క్వాలిటీతో కూడిన చీరలను ఇస్తామని భారీగా ప్రచారం చేస్తున్నారు. కానీ సిల్క్ చీరలను పంపిణీ చేస్తున్నారు” అని  మండిపడ్డారు. తాము తీసుకున్న చీరలతో గిరిజన మహిళలంతా గ్రామం నడిబొడ్డుకు వెళ్లారు. అన్నింటినీ కింద పడేసి కాల్చేశారు. క్వాలిటీ లేని చీరలను పంపిణీ చేసి మహిళలను సీఎం కేసీఆర్ అవమానపరుస్తున్నారని గ్రామస్తురాలు భూక్యా సునీత విమర్శించారు.