బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో అత్యంత ప్రభావం..

 బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో అత్యంత ప్రభావం..

దేశంలో పలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన మిథిలీ తుపాను తర్వాత బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2023లో ఇది నాలుగో తుపాను.. ఇది భారత్, బంగ్లాదేశ్, మయన్మార్ లను తాకే అవకాశం ఉందని స్కైమెట్ వెదర్ సూచిస్తోంది. 

రాబోయే ఉష్ణ మండల తుపాను  మూలాన్ని గల్ఫ్ ఆప్ థాయ్ లాండ్ లో గుర్తించవచ్చు. నవంబర్ 25 లేదా ఆ తర్వాత భూమధ్యరేఖ ద్వారా అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ..భారతదేశం, బంగ్లాదేశ్ , మయన్మార్ తీరప్రాంతంలో ల్యాండ్‌ఫాల్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

ఈ తుపాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే ఈ తుపాను ఈ ప్రాంతాలను తాకుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. బంగాళాఖాతంలో ఈఏడాది  సంభవించే 4వ తుపానును  మిచాంగ్ అని లేదా మిగ్జామ్ అని పిలుస్తారు.

సాధారణంగా ప్రతి యేటా ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలల మధ్య తుపానులు ఏర్పడతాయి. భారతీయ సముద్రాలలో ప్రతి సంవత్సరం దాదాపు 4 తుపానులు ఏర్పడటం సాధారణం. అయినప్పటికీ దీనికి విరుద్ధంగా వెచ్చటి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఏడాదిలో  4కంటే ఎక్కువ తుపానులకు కూడా దారి తీయొచ్చు. ఈ ఏడాది సంభవించే తాజా తుపాను దేశంలో ఏర్పడే ఆరవ తుపానుగాను.. బంగాళాఖాతంలో నాల్గవ తుపాను అవుతుంది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా మరిన్ని తుపానులు ఏర్పడతాయని వాతావరణ శాఖ భావిస్తోంది.