- 26 నాటికి తుఫానుగా మారే అవకాశం
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారం నాటికి వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 25 నాటికి తీవ్రవాయుగుండంగా బలపడి.. 26 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 27 నుంచి వర్షాలు మొదలై.. 28న పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో 26వ తేదీ వరకు పొడి వాతావరణమే కొనసాగుతుందని, 27వ తేదీ నుంచి వాతావరణంలో మార్పులు మొదలవుతాయని ఐఎండీ వెల్లడించింది. 27న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. 28న భారీ వర్షాలు పడతాయని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
29న పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో రాగల 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఏర్పడే అవకాశముందని పేర్కొంది.
