నిఖత్ జరీన్‌‌కు బీబీసీ ‘స్పోర్ట్స్ ఉమన్’ అవార్డు

నిఖత్ జరీన్‌‌కు బీబీసీ ‘స్పోర్ట్స్ ఉమన్’ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ అందించే ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలో ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రోగ్రాం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎంపీలు, హాకీ ఇండియా ప్రెసిడెంట్, మాజీ ఎంపీ దిలీప్ టెర్కే తదితరులు పాల్గొన్నారు. జరీన్‌‌తో పాటు వెయిట్ లిఫ్టర్ మీరా బాయి, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్, షట్లర్ పీవీ సింధు, ఇతర మహిళా క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు.

వేదికపై జరీన్ తండ్రి ఎండీ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన కూతురు నిఖత్ జరీన్ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి ఒక తండ్రిగా తాను చేసింది కొంతేనని చెప్పారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితల ప్రోత్సాహం, సహకారమే జరీన్ ను ఉన్నత శిఖరాలకు చేర్చిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్.. అంతర్జాతీయ వేదికలపై జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది.