
- బీజేపీ అడుగడుగునా అడ్డుకుందని ఆగ్రహం
- రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కోర్టు తీర్పు కాపీల దహనం
- ఇది ముమ్మాటికీ బీసీ వ్యతిరేక శక్తుల పనే!: జాజుల
- గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్లే స్టే వచ్చిందని వ్యాఖ్య
- నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- సుప్రీంకోర్టు తీర్పుకు హైకోర్టు స్టే వ్యతిరేకమన్న ఆర్ కృష్ణయ్య
- రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కామెంట్
- స్టేను సుప్రీంకోర్టులో వెకేట్ చేయించాలి: దాసు సురేశ్
ముషీరాబాద్, వెలుగు: అగ్రకుల పార్టీలు, ప్రభుత్వాలు, వారి ఆధిపత్యంలోని రాజ్యాంగ వ్యవస్థలు మరోసారి బీసీలను మోసం చేశాయని బీసీ సంఘాలు మండిపడ్డాయి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా గురువారం రాత్రి హైదరాబాద్ విద్యానగర్ నల్లకుంట చౌరస్తాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైకోర్టు స్టే తీర్పు దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రమంతా మద్దతిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా బీసీలకు రిజర్వేషన్లపై మరోసారి ద్రోహం చేసిందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై బీజేపీ అడుగడుగునా అడ్డుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దొంగదారిన పిటిషన్లు వేసిందని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టించకపోతే.. ఆ రాజకీయ పార్టీలన్నింటినీ బహిష్కరించే విధంగా బీసీలు సంసిద్ధం కావాలని సూచించారు.
అన్ని పార్టీలకు బీసీ సంఘాలు తొత్తులుగా కాకుండా ఎక్కడికక్కడ ఉద్యమ నిర్మాతలు కావాలని కోరారు. బీసీ వ్యతిరేక తీర్పునకు కారణమైన అన్ని పార్టీలు, వ్యవస్థల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రిజర్వేషన్ సంగతి తేల్చకుండా స్థానిక ఎన్నికల్లోకి వెళితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అందర్నీ కలుపుకొని బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని తెలిపారు.