
- కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
- పెద్దగా కనిపించని బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు
కరీంనగర్ నెట్వర్క్ :బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్ శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఒకటి, రెండు అవాంఛనీయ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయమే అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్దకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, బీసీ సంఘాల నాయకులు చేరుకుని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. రోడ్లపై తిరుగుతూ షాపులు, హోటళ్లు బంద్ చేయించారు.
బంద్ నేపథ్యంలో విద్యా సంస్థలకు ఆయా యాజమాన్యాలు ముందే సెలవు ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. బంద్ కు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చినప్పటికీ ఆ పార్టీల శ్రేణులు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ఇదే అదనుగా ట్యాక్సీ డ్రైవర్లు మూడింతల చార్జీలు డిమాండ్ చేసి గమ్య స్థానాలకు చేర్చారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సీపీఐ, సీపీఎం, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ బిల్లును అడ్డుకున్న వాళ్లే బంద్‌లో పాల్గొంటున్రు
జగిత్యాల టౌన్, వెలుగు : బీసీ బిల్లును అడ్డుకున్న బీజేపీ వాళ్లే బీసీ సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ లో పాల్గొంటున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి బీసీ సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు.