బీఆర్ఎస్ మద్దతుదారుడిని కాదని.. బీసీ లక్ష సాయం చెక్కు ఇయ్యట్లే

బీఆర్ఎస్ మద్దతుదారుడిని కాదని.. బీసీ లక్ష సాయం చెక్కు ఇయ్యట్లే

కామేపల్లి, వెలుగు: బీఆర్ఎస్​మద్దతుదారుడిని కాదని తనకు రావాల్సిన బీసీ రూ.లక్ష సాయం ఆపారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఓ లబ్ధిదారుడు సోమవారం నిరసనకు దిగాడు. చెక్కు ఇవ్వకపోతే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన వడ్డెర కులస్తుడు చల్లా వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం ఇటీవల బీసీ సాయం కింద రూ.లక్ష మంజూరు చేసింది. 

చెక్కు తీసుకునేందుకు ఎంపీడీఓ విజయభాస్కర్​రెడ్డిని సంప్రదించగా, పొరపాటుగా లిస్టులో నీ పేరు వచ్చిందని, జిల్లా బీసీ ఆఫీసర్​చెక్కు ఆపారని తెలుసుకుని వెంకటేశ్వర్లు కంగు తిన్నాడు. అయితే బీఆర్ఎస్ కు చెందిన ఓ ముఖ్య నేత తాను కాంగ్రెస్​పార్టీ మద్దతుదారుడిని కావడంతోనే చెక్కు ఆపారని, ప్రభుత్వ సాయం పొందాలంటే రూ.50 వేలు తమ కార్యకర్తకు ఇవ్వాలని డిమాండ్​చేసినట్లు వెంకటేశ్వర్లు ఆరోపించాడు. సోమవారం ఎంపీడీఓ ఆఫీస్​ఎదుట పెట్రోల్​బాటిల్​తో తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగాడు. 

తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని, తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ సాయం అందితే మిల్లర్ కొనుక్కొని బతుకుతానని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరాడు. ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డిని వివరణ కోరగా.. ఒకరి బదులు మరొకరి పేరు రావడంతోనే చెక్కు ఆపారని చెప్పారు.