కులగణన బీసీల చిరకాల స్వప్నం

కులగణన బీసీల చిరకాల స్వప్నం

పెళ్లయితేనే పిచ్చి కుదురుతుంది-– పిచ్చి కుదిరితేనే పెళ్ళవుతుంది” అన్నట్టుంది బీసీ కులగణన పరిస్థితి. చెట్టు ముందని ఒకరంటే కాదు కాదు, విత్తేముందు అన్నట్టూ ఉంది.  బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్‌‌ కేటాయించాలన్నా,  స్థానిక  సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కులగణన చేయాలంటారు.  పోనీ ఇదివరకున్న లెక్కల ప్రకారమైనా బీసీలకు అన్నీ అందుతున్నాయా అంటే అదీ లేదు.  

కేసీఆర్‌‌ లాంటి నాయకులైతే బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లను 33శాతం  నుంచి 22 శాతానికి తగ్గించి మరీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపాడు. స్వాతంత్ర్యానంతర కాలం నుంచి కులగణన విషయం తెరపైకి వస్తూనే ఉంది.  మండల్‌‌ కమిషన్‌‌తో పాటు ముందూ వెనుకా కూడా కమిషన్లు వేసి రిపోర్టు తయారుచేశారు. అయినా వాటికి చట్టబద్ధత లేదని మూలకు పడేశారు.  55శాతం జనాభాగా ఉన్న భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, సామాజిక రంగాలలో  బీసీల పరిస్థితి పదిశాతంగా కూడా లేదు. ఎస్సీల కంటే  అధ్యాన్న పరిస్థితుల్లో బీసీలున్నారు. రాజీవ్‌‌గాంధీ  స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించేంతవరకు సర్పంచ్‌‌లుగా ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా ఉన్న బీసీలు నామమాత్రమే. ఒక్క తమిళనాడులో మాత్రం డీఎంకే  ప్రభుత్వం వల్ల బీసీల పరిస్థితి కొంతమెరుగ్గా ఉంది.  

బీసీలను పట్టించుకోని మోదీ

కాంగ్రెస్‌‌ పార్టీ ఒక్కటే అన్ని పార్టీలకంటే బీసీలు, అణగారిన జాతులపట్ల మెరుగైన రీతిలో ప్రవర్తిస్తుంది. అందులో భాగంగానే నెహ్రూ కాలంలో అంబేద్కర్‌‌ చెప్పినట్టు బీసీల రిజర్వేషన్లకు కాలే ల్కర్‌‌ కమిషన్‌‌ను ప్రకటించడం, బీజేపీ సంప్రదాయ శక్తులు బలం పుంజుకుంటున్న కొద్దీ బీసీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీసీలు ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోయారు. రాజీవ్‌‌ గాంధీ ధైర్యం చేసి స్థానిక సంస్థల్లోనయినా రిజర్వేషన్లు ప్రకటించారు. దాంతో బీసీలు రాజకీయాల్లోకి రావడం ఎక్కువయింది. మండల్‌‌ నివేదిక బయటకొచ్చిన తర్వాత బీసీల్లో మరింత చైతన్యం పెరిగింది.  బీసీని అని చెప్పుకుంటూ మోదీ మూడుసార్లు ప్రధానమంత్రిగా గెలిచినా బీసీల గురించి  పట్టించుకున్నది లేదు. 

 కులగణనకు అంగీకరించి చేసిందీ లేదు.  యువ రాజకీయ నాయకుడు రాహుల్‌‌గాంధీ ముత్తాత నెహ్రూ. అమ్మమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌‌గాంధీ, జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శాలను జీర్ణించుకున్నవాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న తిరోగమన భావజాలాన్ని అభివృద్ధి నిరోధక పనులను బాగా మననం చేసుకున్నవాడు. దేశం ప్రగతిశీల భావజాలానికి వ్యతిరేకంగా మధ్యయుగాల్లోకి పయనించడం ఆయన దృష్టిని దాటిపోలేదు.  బహుజనులపై, దళితులపై జరుగుతున్న దాడులను, బహుజన వ్యతిరేక చర్యలను దృష్టిలోకి తెచ్చుకున్నాడు. 

కులగణనకు రాహుల్​ వాగ్దానం


రాహుల్‌‌ కాంగ్రెస్‌‌ను గెలుపు దగ్గరికి తీసుకెళ్ళి నిలిపాడు. కులగణన చేస్తానని ప్రకటించారు. అనతికాలంలోనే ఆరు హామీలను అమలు చేస్తూ అశేష ప్రజల మన్ననలందుకుంటున్న రేవంత్‌‌రెడ్డి కాంగ్రెస్‌‌ హామీలు మాట తప్పనితనాన్ని చూపిస్తున్నాయి. బీసీల చిరకాల వాంఛ అయిన కులగణన దేశవ్యాప్తంగా చేయడం రాహుల్‌‌గాంధీభుజస్కంధాలపై ఉంది.

- కాలువ మల్లయ్య