బిహార్ తరహాలో కులగణన చేపట్టాలి: బీసీ సంఘాల నేతలు

బిహార్ తరహాలో కులగణన చేపట్టాలి: బీసీ సంఘాల నేతలు
  • సైంటిఫిక్​గా చేస్తే న్యాయపరమైన చిక్కులు రావు
  •     ఇందుకు రాజ్యాంగబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి
  •     రౌండ్​టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నేతలు

హైదరాబాద్, వెలుగు : శాస్త్రీయమైన కులగణన ద్వారానే భవిష్యత్​లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుందని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. కులగణన లేకుండా ఇతర మార్గాల ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ‘‘స్థానిక సంస్థల ఎన్నికలు- బీసీ రిజర్వేషన్ల పెంపు- భవిష్యత్ కార్యాచరణ’’పై బీసీ కుల సంఘాలు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బిహార్ తరహలోని తెలంగాణలో కూడా కులగనణ చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. బీసీ కులగణన సాధించడానికి ప్రభుత్వం మీద పార్టీలకతీతంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాడాలని సూచించారు. ప్రభుత్వం భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో, వైస్ చాన్సలర్ పదవుల్లో జనాభా దామషా ప్రకారం 50శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని ఇందుకు బీసీలంతా సంఘటితంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ హామీ నెరవేస్తుందని నమ్ముతున్నం

కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నామని, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తారని బీసీలంతా విశ్వసిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో కులగనణ చేపట్టడానికి ప్రత్యేకంగా ఒక కులగనణ కమిషన్ ను ఏర్పాటు చేసి తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలని  సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. బీసీలకు గతంలో రిజర్వేషన్లు తగ్గించి కేసీఆర్ అన్యాయం చేశారు.. ఆ పొరపాటును ప్రస్తుత సీఎం చేయరని నమ్మకం ఉందన్నారు. గత పడేండ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీ కులాల లెక్కలు తీయకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గించి మాజీ సీఎం కేసీఆర్ బీసీలను రాజకీయంగా గొంతు కోశారని ఫైర్ అయ్యారు. బీసీ కులగనణ నిర్వహించి బీసీ  రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల బహిరంగ సభలలో  మాట్లాడటం అభినందనీయమన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రత్యేకంగా ఒక కులగణన కమిషన్​ను ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా సమగ్ర కులగనణ చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. 

ఈ అంశంపై  136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో సీఎం రేవంత్ రెడ్డిని, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలవనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నో సంవత్సరాలగా పోరాడి కులగణనను ఒక ప్రధాన అంశంగా తీసుకు వచ్చామని, ఈ ప్రక్రియను పక్కదారి పట్టించడానికి గతంలో రిజర్వేషన్లు తగ్గించి బీసీలను రాజకీయంగా అణచివేసిన వాళ్లే తెర వెనక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, ప్రొఫెసర్లు గాలి వినోద్ కుమార్, హెచ్ సీయూ ప్రొఫెసర్ వెంకటేశంతో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు.