బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తం..అక్టోబర్ 18న రాష్ట్ర బంద్లో అందరూ పాల్గొనాలి: ఆర్.కృష్ణయ్య

బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తం..అక్టోబర్ 18న రాష్ట్ర బంద్లో అందరూ పాల్గొనాలి: ఆర్.కృష్ణయ్య
  •     బంద్ సెగ ఢిల్లీకి తాకాలి
  •     ఈ పోరాటం బీసీలందరి కోసం
  •     బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ మద్దతుపై హర్షం

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్, వెలుగు: బీసీలకు అన్యాయం జరిగితే భూకంపం సృష్టిస్తామని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్ సెగ ఢిల్లీకి తాకాలని పిలుపునిచ్చారు. బంద్ కేవలం ఏ ఒక్కరి కోసమో కాదని, బీసీలందరి కోసమని తెలిపారు. బీసీలందరూ బంద్​లో పాల్గొనాలని కోరారు. ఒక్క ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప అన్ని విభాగాలు బంద్ లో పాల్గొంటాయని, శాంతియుతంగా బంద్ చేయాలని కోరారు. బంద్​కు సహకరించకపోతే బలవంతంగా మూసివేయిస్తామని హెచ్చరించారు. బీసీ జేఏసీకి బీసీ జర్నలిస్టు అసోసియేషన్ మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. 

ఈ మేరకు సీనియర్ జర్నలిస్టు రమణ కుమార్ అధ్యక్షతన బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. మీటింగ్​కు హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రెడ్డి జాగృతి పోరాటం న్యాయంగా ఉండాలన్నారు. ‘‘పార్టీలతో మాకు సంబంధం లేదు. బీసీల మంచి కోసమే నేను పోరాడుతున్న. ఎన్టీఆర్, విజయభాస్కర్ రెడ్డి సమయంలో పోరాడితే కొంత న్యాయం జరిగింది. 

ఆ స్ఫూర్తితో పోరాటం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఎక్కువ మంది పేదోళ్లు బీసీల్లోనే ఉన్నరు’’అని ఆర్.కృష్ణయ్య అన్నారు. కాగా, బంద్ కు మద్దతుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం విద్యానగర్ బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు.

కలాన్ని.. గళాన్ని ఆయుధాలుగా అందించండి: దాసు సురేశ్​

జై బీసీ ఉద్యమానికి జర్నలిస్టులు కలాన్ని.. గలాన్ని ఆయుధాలుగా అందించాలని బీసీ జేఏసీ సభ్యుడు దాసు సురేశ్ కోరారు. మీడియా సంస్థలకు మూల స్తంభాలు బీసీలేనని, బీసీల ఆత్మగౌరవ పోరాటానికి అండగా నిలవాలని కోరారు. బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. 

కేంద్ర, రాష్ట్ర పీఠాలు కదలాలి: వీజీఆర్ నారగోని

బంద్ ఫర్ జస్టిస్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పీఠాలు కదిలిపోవాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం బీసీల పట్ల వ్యవస్థలు వ్యతిరేకంగా ఉన్నాయనడానికి నిదర్శనమని జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ మాత్రమే బీసీలకు శ్రీరామరక్ష అని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడానికి సీఎం రేవంత్ పూర్తి బాధ్యత వహించాలని బీసీ జేఏసీ కో చైర్మన్ రాజారాం యాదవ్ అన్నారు. 

కోర్టులపై నమ్మకం లేదు: జాజుల 

ఏ కోర్టూ.. న్యాయం చేయలేదని, అందుకే తమకు కోర్టులపై నమ్మకం లేదని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ‘‘ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి నిర్ణయం తీసుకుంటే చాయ్ తగినంత సేపట్లో పరిష్కారం దొరుకుతది. సమస్య పరిష్కరించకపోతే మేము ఏంటో చూపిస్తాం. గ్రామాల్లో ఇప్పటికే బీసీ ఉద్యమం ఊపందుకున్నది. జేఏసీకి మంచి మద్దతు లభిస్తున్నది’’అని జాజుల అన్నారు.