- రాహుల్ గాంధీని కలిసి ప్రైవేట్ బిల్లు పెట్టాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
- సర్పంచ్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై బీసీ జేఏసీ విసృత స్థాయి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ సవరణతోనే బీసీల రిజర్వేషన్లు సాధ్యమవుతాయని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ కృషి చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలోని ఒక హోటల్ లో “బీసీ రిజర్వేషన్లు, సర్పంచ్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ” పై ఆల్ పార్టీ నేతలతో బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మీటింగ్ లో 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు, 20 ఉద్యోగ సంఘాల నేతలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రిజర్వేషన్ల సాధనకు 10 తీర్మానాలు చేశారు. బీసీ జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జాజుల మాట్లాడుతూ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ ఎన్నికలకు ముందే సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాహుల్ గాంధీ ద్వారా ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగానే ఈ నెల 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం, 30న బీసీల రాజకీయ యుద్ధభేరి సభ, డిసెంబరు 9న పార్లమెంట్ ముట్టడి నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీల ఆకాంక్షలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదానికి కృషి చేస్తాడని నమ్మకం ఉందన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లతో 50 శాతం సీలింగ్ దాటినప్పుడు లేని అభ్యంతరాలు.. బీసీ రిజర్వేషన్ల విషయంలోనే కోర్టులు ఎందుకు లేవనెత్తుతున్నాయని ప్రశ్నిచారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు మోసం చేస్తున్నాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలడ్డడం తోని బీసీ రిజర్వేషన్ల సమస్య మొదటికి వచ్చిందని కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ గౌడ్, వి హనుమంతరావులు తెలిపారు.
